బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 17, 2020 , 01:54:02

కరోనా వదంతులపై పోలీసుల నిఘా

కరోనా వదంతులపై పోలీసుల నిఘా

కరోనా ప్రబలకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్‌-19 వైరస్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖతోపాటు ఇతర శాఖలు సమన్వయంతో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అనుమానితుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌, వైద్యుల ఫోన్‌ నంబర్లపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా దుష్ప్రచారంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. తప్పుడు ప్రచారం చేసేవారి వివరాలను పోలీసు శాఖ వాట్సాప్‌ నెంబర్‌ 8333986898కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఏర్పాటు చేసిన 20 పడకల ఐసోలేషన్‌ వార్డును రిమ్స్‌డైరెక్టర్‌ బలరాం నాయక్‌, డీఎంహెచ్‌వో చందు సోమవారం పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ నెల 31వరకు విద్యా సంస్థల బంద్‌ ప్రకంటించి జనం రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

  • కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు
  • పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 8333986898కు సమాచారం ఇవ్వాలని సూచన
  • ఐసోలేషన్‌ వార్డును పరిశీలించిన రిమ్స్‌ డైరెక్టర్‌, డీఎంహెచ్‌వో

ఎదులాపురం: కరోనాపై జిల్లా వైద్యశాఖ అప్రమత్తంగా ఉందని, అనుమానితులు వస్తే వారికి తక్షణమే చికిత్స అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉన్నామని రిమ్స్‌ డైరెక్టర్‌ బి.బలరాం నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డును సోమవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి తొడసం చందుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అంతటా కరోనా వైరస్‌, (కోవిడ్‌-19)పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైరస్‌పై ప్రజలు భయాందోళనకు గురికావద్దని, బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు లేవన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. ఇది వరకు అనుమానితులను గాంధీ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేయించగా వారికి కరోనా వైరస్‌ లేదని వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. రిమ్స్‌లో 20 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశామన్నారు. జనరల్‌ ఫిజీషియన్‌ తానాజీ  (సెల్‌:  9441038617) శ్వాసకోశ వైద్య నిపుణుడు సందీప్‌ జాదవ్‌ (సెల్‌: 7981745976)ను నియమించామని తెలిపారు. దవాఖానల్లో వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియా, వ్యక్తిగత సంరక్షణ కిట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వార్డుకు తాళం వేసినట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై స్పందిస్తూ.. వార్డులో రోగులు లేరని, రూ. కోట్ల విలువైన పరికరాలు ఉండడంతోనే తాళం వేసినట్లు చెప్పారు. కరోనా అనుమానితులు ఉంటే చికిత్స అందించేందుకు అన్ని వేళల్లో సిద్ధంగా ఉన్నామన్నారు. రిమ్స్‌లోని అన్ని వార్డుల్లో కరోనా వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐసోలేషన్‌ వార్డు సమాచారాన్ని అందుబాటులో ఉంచామన్నారు. వారి వెంట వైద్యులు సందీప్‌ జాదవ్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌వో ఈశ్వర్‌రాజ్‌, మెడికల్‌ ఆఫీసర్లు ఉన్నారు.logo