గురువారం 09 ఏప్రిల్ 2020
Adilabad - Mar 17, 2020 , 01:31:02

సొంతింటి కల సాకారం

సొంతింటి కల సాకారం

సొంతింటిలో కుటుంబంతో సంతోషంగా ఉండాలని ప్రతి పేదోడు ఎన్నో కలలు కంటాడు. ఇల్లు నిర్మించుకోవాలంటే ఆర్థిక పరమైన ఎన్నో సమస్యలు ఉంటాయి. గుడిసెలు, కిరాయి గూడులో ఉంటూ ఏండ్ల తరబడి డబ్బు కూడబెట్టినా వారి కల.. కలగానే ఉంటున్నది. ఇలాంటి పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తున్నది. ఇందుకోసం డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే అర్హులైన కుటుంబాలకు ఉచితంగా అందిస్తున్నది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి విడతల వారీగా కేటాయిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 4195 ఇండ్లు మంజూరు కాగా.. వీటిలో 3213 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో, 982 ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పలు గ్రామాల్లో ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు మిగితా గ్రామాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

  • జిల్లాకు 4125 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు
  • నిర్మాణాలు పూర్తయిన గ్రామాల్లో లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ
  • పలు చోట్ల కొనసాగుతున్న పనులు
  • సంతోషం వ్యక్తంచేస్తున్న పేదలు

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:  గూడులేని పేదల కోసం ప్రభుత్వం ప్రారంభించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,195 రెండు పడక గదుల ఇండ్లును ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3,213 గ్రామీణ ప్రాంతాల్లో, 982 గృహాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2015-16 సంవత్సరంలో మొత్తం 1,510 డబుల్‌  బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో  ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు 318, పట్టణ ప్రాంతాల ప్రజలకు 582, బోథ్‌ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు 400, ఖానాపూర్‌ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి 160, బోథ్‌ నియోజకవర్గంలో 50 ఉన్నాయి. 2016-17 సంవత్సరంలో జిల్లాకు మొత్తం 2,685 రెండు పడకగదుల ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,016, పట్టణ ప్రాంతాల్లో 400, బోథ్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో 881, ఖానాపూర్‌ నియోజకవర్గంలో గ్రామాల్లోని లబ్ధిదారులకు 288, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల పేదలకు 100 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

జిల్లాలోని పలు గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు పూర్తికాగా అర్హులైన పేదలకు అధికారులు పంపిణీ చేశారు. ఇంతకాలం పూరి గుడిసెలు, కిరాయి ఇండ్లలో చాలీ చాలని గదుల్లో జీవనం సాగించిన పేదలు సర్కారు నిర్మించిన ఇచ్చిన ఇండ్లలో సంతోషంగా ఉంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇచ్చిన ఇండ్లలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా లబ్ధిదారులకు శుద్ధ్దమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీల్లో రహదారులు, మురికి కాల్వలు నిర్మిస్తున్నారు. విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు కాలనీల్లో ఆహ్లాదం కోసం మొక్కలను నాటుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, అన్ని సౌకర్యాలతో సర్కారు ఇచ్చిన ఇండ్లలో పేద కుటుంబాలు ఆనందగా ఉంటున్నారు. ఎన్నో ఏండ్లుగా గుడిసెలు, కిరాయి ఇండ్లలో ఉన్న పేదలు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్‌బెడ్‌రూం ఇండంలె యజమానులు కావడంపై పట్టరాని సంతోషాన్ని  వ్యక్తంచేస్తున్నారు.


ఈమె పేరు  పసుపుల విజయ. తాంసి మండలం బండలనాగాపూర్‌ గ్రామం. చేపల వేట వీరి కులవృత్తి.  ఎన్నో ఏండ్లుగా పూరి గుడిసెలో భర్త, పిల్లలతో కలిసి ఉన్నారు. వీరికి ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో.. ఈ  పేద కుటుంబం సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసింది. 13 నెలల క్రితం గ్రామంలో నిర్మించిన 100 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో నుంచి అధికారులు విజయకు ఓ ఇంటిని కేటాయించారు. ప్రస్తుతం ఈమె ఓ ఇంటికి యజమాని అయ్యింది. మిషన్‌ భగీరథ తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం,  ఆవరణలో పచ్చని మొక్కల మధ్య ఈ కుటుంబం ఆహ్లాదకర వాతావరణంలో మునుపటికంటే ఆనందంగా జీవిస్తున్నది. 

పంచాయతీ చరిత్రలో ఇదో కీలక ఘట్టం

ఉమ్మడి జిల్లాలోనే 100  డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడం మా పంచాయతీ చరిత్రలోనే ఓ కీలక ఘట్టం. లబ్ధిదారులకు ఇండ్లు అందజేసి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఇండ్ల నిర్మాణాకికి సరిపడా స్థలం అందుబాటులో ఉండడం అనుకూలించింది. అధికారులు, ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, అప్పటి ఎంపీ నగేశ్‌, మంత్రులు సహకారంతో పేదల కల సాకారమైంది. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలుచేస్తూ ప్రజాభాగస్వామ్యంతో  ఒక ఆదర్శ పంచాయతీగా నిలబడాలనేదే మా లక్ష్యం.

- గంగుల వెంకన్న, సర్పంచ్‌, బండలనాగాపూర్‌ 

100 కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి..

మా స్వగ్రామం బండలనాగాపూర్‌లో 100 పేద కుటుంబాలు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో సంతోషంగా ఉన్నాయి. వారివారి పనులు చేసుకుంటూ కుటుంబాలతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. పంచాయతీకి అన్ని పన్నులు చెల్లిస్తున్నారు. ఈ కుటుంబాల ఆనందం చూస్తే మాకు ప్రజాసేవపై మరింత ఉత్తేజాన్ని కలిస్తున్నది. ఒక్క బండలనాగాపూర్‌ గ్రామమే కాకుండా తాంసి మండలాన్ని జిల్లాలో మేటిగా నిలపాలనేదే మా ఆశయం. 

-సురుకుంటి మంజుల, తాంసి ఎంపీపీ  


logo