ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Mar 16, 2020 , 01:49:13

‘పందిరి’ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

‘పందిరి’ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

దళిత రైతుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రైతులు పందిరి కూరగాయలు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఎకరానికి రూ.3.50లక్షల వరకు మంజూరు చేయాలని నిర్ణయించింది. నీటి సౌకర్యం ఉన్న ఎస్సీ రైతుల భూములకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామాల్లో అవగాహ సదస్సులు నిర్వహిస్తున్నారు.

  • రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి
  • పందిరి కూరగాయల సాగుకు ప్రోత్సాహం
  • ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
  • ఎకరానికి రూ.3.50 లక్షల వరకు మంజూరు
  • హార్టికల్చర్‌ ఆధ్వర్యంలో రైతుల ఎంపిక
  • గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు
  • నీటి సౌకర్యం ఉన్న భూములకు ప్రాధాన్యం

గుడిహత్నూర్‌ రూరల్‌: ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు భళే డిమాండ్‌ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు దళిత రైతులకు ఎస్సీ కార్పొరేషన్‌ ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయం తీసుకున్నది. అందుకోసం పందిరిసాగుపై దృష్టి సారించే రైతులను ఎంపిక చేసి ప్రోత్సాహం అందించడానికి తగిన ప్రణాళికలు తయారు చేసింది. కూరగాయల సాగు చేసే దళిత రైతులకు ఎకరానికి రూ.3.50లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించింది. హార్టికల్చర్‌ జిల్లా అధికారులు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఆధ్వర్యంలో కూరగాయలు సాగు చేసే దళిత రైతులకు వివిధ గ్రామాల్లో ఇప్పటికే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కూరగాయలు సాగు చేసే రైతులు ఎంతమంది ఉన్నా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు వాణిజ్య పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పందిరి కూరగాయల సాగును అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశాలతో దళిత ఆర్థికాభివృద్ధి సంస్థ ఈడీ శంకర్‌ ఆధ్వర్యంలో దళిత రైతులకు పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. 

పందిరి కూరగాయల సాగుకు ప్రణాళికలు రెడీ.. 

ఈ ప్రణాళిక ప్రకారం ప్రతి దళిత రైతుకు పందిరి కూరగాయల సాగుకు ఎకరానికి 2.10 లక్షల రాయితీతో ఎస్సీ కార్పొరేషన్‌ ఆర్థిక సహాయం అందజేస్తుండగా, మరో 1.40 లక్షలను బ్యాంకు ద్వారా రుణం పొందేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో పందిరి ఏర్పాటు, కూరగాయల సాగు విధానం అన్నీ ఎస్సీ కార్పొరేషన్‌, హర్టికల్చర్‌ శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 

నీటి సౌకర్యం ఉన్న భూములకు ప్రాధాన్యం.. 

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం పొందే రైతుల భూములకు నీటి సౌకర్యం ఉంటే మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒకే గ్రామం నుంచి ఎక్కువ సంఖ్యలో కూరగాయలను సాగుచేసే రైతులు ఉంటే వారి కోసం రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని సమకూర్చనున్నారు. వారు నిత్యం తాము పండించిన కూరగాయలను ఆ వాహనంలో పట్టణాలకు తీసుకెళ్లి విక్రయించే వీలు కలుగుతుంది. రైతులు ఇలా స్వయంగా కూరగాయలను విక్రయించుకుంటే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. 

జిల్లాలోని 18 మండలాల నుంచి రైతుల ఎంపిక.. 

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని 18 మండలాల నుంచి రైతులను ఎంపిక చేయనున్నారు. మండలాల్లో దళిత రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేసే గ్రామాలను ఎంపిక చేసి పందిరి రకం కూరగాయల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు గుడిహత్నూర్‌లోని ఇన్కర్‌గూడలో 25 , లింగాపూర్‌, తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్‌లో14 మంది, తాంసి మండలంలోని పొన్నారి, ఇచ్చోడలోని జున్ని గ్రామం నుంచి 14 మంది, బజార్‌హత్నూర్‌లోని కినార్‌పెల్లి నుంచి 19 మంది, ఇంద్రవెల్లిలోని ధనోర(బీ) పంచాయతీలోని ఇన్కర్‌గూడ, ఉట్నూర్‌ మండలంలోని గోదారిగూడ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ఎంపిక చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. బజార్‌హత్నూర్‌ మండలంలోని కినార్‌పల్లి రైతులను నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌కు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లి పంటల సాగుపై అవగాహన కల్పించారు. 

దరఖాస్తు చేసుకోవడం ఇలా.. 

ఆసక్తి ఉన్న రైతులు తమ పట్టా పాసుబుక్‌, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకు పాస్‌ బుక్‌ జిరాక్స్‌, పాస్‌ ఫొటోతో ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 

రూ.5.25 కోట్లతో దళిత రైతులకు ఆర్థిక తోడ్పాటు.. 

జిల్లాలోని దళిత రైతులకు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.5.25 కోట్లు ఖర్చు చేయనుంది. పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించి వారి ఆర్థికాబివృద్ధి తోడ్పాటుకు కృషి చేయనుంది. జిల్లాలో కూరగాయల సాగు ఆశించినంత లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కూరగాయ పంటలు సాగు చేస్తే ఇక్కడ ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. జిల్లా వాతావరణం కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు కారణం రవాణా సౌకర్యం, సాగుకు పెట్టుబడి, ఇతర ఖర్చులు ఉండడమే. ఎక్కువ శాతం రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో కూరగాయలు పండించే ప్రాంతాల్లో ఆర్థిక తోడ్పాటును అందిస్తూ దళిత రైతులను మొదట పందిరి కూరగాయలు వైపు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో పందిరి కూరగాయల సాగుకు ఎంత మంది దళిత రైతులు ఆసక్తి చూపితే వారందరికీ ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి 

దళిత రైతుల ఆర్థికాభివృద్ధికి పందిరి కూరగాయల సాగు చాలా లాభదాయకమైన విధానం. వారికి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ఇందుకోసం గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎకరం భూమిలో పందిరి రకం కూరగాయలను సాగు చేసుకోవచ్చు. ఎకరాకు ప్రభుత్వం 3.50 లక్షల రూపాయలను ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అందజేస్తున్నది. సొంత భూమి ఉండి, నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

-శంకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ఆదిలాబాద్‌ logo