శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Mar 16, 2020 , 01:33:55

కరోనా కట్టడి

కరోనా కట్టడి

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నది. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి 08732 - 220462 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ దవాఖాన, ఉట్నూర్‌లోని ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. రిమ్స్‌లో 20, ఉట్నూర్‌ వైద్యశాలలో పది బెడ్‌లను అందుబాటులో ఉంచారు. ఇక్కడ ప్రత్యేకంగా వైద్య నిపుణులను నియమించి 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఈనెల 31వ తేదీ వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు నెలాఖరు వరకు సెలవులు ప్రకటించడంతో హాస్టల్‌ విద్యార్థులు ఇండ్లకు వెళ్లారు.

  • జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు
  • అందుబాటులో 08732- 220462 టోల్‌ ఫ్రీ నంబర్‌
  • ఆదిలాబాద్‌, ఉట్నూర్‌లో ఐసోలేషన్‌ వార్డులు
  • అందుబాటులో వైద్య నిపుణులు
  • 31 వరకు ప్రజావాణి రద్దు
  • ముందస్తు చర్యలు తీసుకున్నాం: కలెక్టర్‌ శ్రీదేవసేన

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కరోన రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే రిమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డు లు ఏర్పాటు చేసి వైద్యులను నియమించారు. మందులు సిద్ధం గా ఉంచడంతో పాటు అనుమానితులు ఏవరైనా వస్తే చికిత్సలు అందించే ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సో మవారం నుంచి ఈనెల 31 వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో జిల్లాలోని వివిధ వసతిగృహాలు, పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మైనార్టీ, బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు తమ సొంత ఇండ్లకు ప్రయాణమయ్యారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సీనిమా థియేటర్లు, జిమ్‌లు, పార్కులు, స్విమ్మింగ్‌ ఫూల్‌లు, బార్‌లు మూసివేశారు. ఆర్టీసీ అధికారులు ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను శుభ్రపరుస్తున్నారు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఉండవని అధికారులు తెలిపారు. కరోనా విషయంలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల31 వరకు నిర్వహించడం లేదని కలెక్టర్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కొవిడ్‌-19వైరస్‌ కలవరపెడుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సిమ్మిగ్‌పూల్‌, క్లబ్‌లు ఈ నెల31 వరకు మూసివేయిస్తున్నామన్నారు. బోర్డు పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు వసతి సౌకర్యం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. వివాహాలకు తక్కువ మంది వచ్చేలా నిర్వాహకులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సభలు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సమ్మర్‌క్యాంపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్‌లు, ర్యాలీలను అనుమతించబోమని తెలిపారు. 

ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు.. 

కరోనా అనుమానితులు ఎవరైనా వ స్తే వారికి తక్షణమే చికిత్స అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ సమాచా రం కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం లో నంబరు 08732- 220462ను ఏ ర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌తో పాటు ఉట్నూర్‌ దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. రిమ్స్‌లో 20 మంచాలతో ఏర్పాటు చేసిన వార్డు లో డాక్టర్‌ తానాజీ  జనరల్‌ ఫిజీషియన్‌ (సెల్‌ నంబరు 94410 38617) డాక్టర్‌ సందీప్‌ జాదవ్‌, శ్వాసకోశ వైద్య నిపుణుడు (సెల్‌ నంబరు, 7981745976)ను ని యమించారు. దవాఖానల్లో వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియా, వ్యక్తిగత సం రక్షణ కిట్‌లను అందుబాటులో ఉం చారు. ఉట్నూర్‌ దవాఖానలో 10 బెడ్‌లతో ఐసోలేషన్‌  వార్డు ఏర్పాటు చేసి డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి (సెల్‌ నంబరు, 9849759105)ని ఇన్‌చార్జిగా ని యమించి, ఇద్దరు మెడికల్‌ ఆఫీస ర్లు, నలుగురు స్టాఫ్‌నర్సులు 24 గం టలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నారు. ప్రజలను చై తన్య పర్చేందుకు రూ.25 వేల ప్రచా ర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు.

మందుస్తు జాగ్రత్తలు.. 

ప్రజలు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని వైద్యు లు సూచిస్తున్నారు. 

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలని కోరుతున్నారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


logo