శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Mar 15, 2020 , 03:48:20

హై అలర్ట్‌!

హై అలర్ట్‌!

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ -19 (కరోనా వైరస్‌)పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా కరోనాపై హై అలర్ట్‌ ప్రకటించగా ఈ నెల 31వరకు జిల్లాలోని విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసి వేయనున్నారు. శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై కరోనా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 31 వరకు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు ఇంటర్‌ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు.

  • ఉమ్మడి జిల్లాలో కరోనాపై ప్రత్యేక దృష్టి
  • మార్చి 31వరకు విద్యాసంస్థలు, సినిమాహాళ్లు బంద్‌
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారుల అప్రమత్తం
  • ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకుంటే కఠిన చర్యలు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: అందరినీ కలవరానికి గురి చేస్తున్న కరోనా వైరస్‌పై సర్కారు సమరానికి సిద్ధమైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై హై అలర్ట్‌ ప్రకటించింది. మార్చి 31వరకు జిల్లాలోని విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయనున్నారు. శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై కరోనా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు  జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 31 వరకు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని నిర్ణయించింది. పది పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఇంటర్‌ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల పరిధిలో ఈనెల 31వరకు విద్యా సంస్థలు, సినిమాహాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ బంద్‌ చేయనున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,242 పాఠశాలల్లో 73,764మంది విద్యార్థులు, ఆదిలాబాద్‌ జిల్లాలో 1,172 పాఠశాలల్లో 72,776 మంది, మంచిర్యాల జిల్లాలో 1,054 పాఠశాలల్లో 64,519మంది, నిర్మల్‌ జిల్లాలో 830 పాఠశాలల్లో 1,16,096 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ మార్చి 31వరకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో 21 సినిమా థియేటర్లు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 11, ఆదిలాబాద్‌లో 4, నిర్మల్‌ జిల్లాలో 5, ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఒకటి చొప్పున సినిమా థియేటర్లు ఉన్నాయి. సినిమా థియేటర్లు, విద్యా సంస్థల్లో ఒకేచోట ఎక్కువ మంది గూమిగూడి ఉంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలను చేపట్టింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈప్రాంతాల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి బెడ్లను సిద్ధంగా ఉంచింది. అనుమానితులను ఇక్కడ చికిత్స చేసి హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. 


అధికారులు అప్రమత్తం.. 

జిల్లాలో కరోనా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండగా తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఒకరిని నుంచి మరొకరికి వేగంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. మరోవైపు అవసరమైన  శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ కంపెనీల వారే అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీంతో తాము వీటిని ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తున్నదని మెడికల్‌ షాపుల వారు చెబుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నారని, దీంతో తాము అసలు వాటిని కంపెనీల నుంచి తీసుకోవడం లేదని అంటున్నారు. చాలా మెడికల్‌ దుకాణాల్లో మాస్క్‌లు, సానిటైజర్లు లభించడం లేదు. కొందరు అధిక ధరల భయంతో కంపెనీల నుంచి తీసుకోకపోగా మరికొందరు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 



logo