శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Mar 15, 2020 , 03:46:39

సంక్షేమప్రగతి

సంక్షేమప్రగతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. అడవులు, ఆదివాసీలు, గిరిజనులు, నిరక్షరాస్యులు ఉన్న జిల్లాగా గతంలో పేరున్న ఆదిలాబాద్‌ ప్రస్తుతం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర జిల్లాలతోనూ పోటీ పడుతున్నది. వ్యవసాయం, పాడి పంటలతో పాటు వస్తు సేవల రంగాల్లోనూ ప్రగతి పరుగులు పెడుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ, రైతులకు ఆర్థిక సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో వ్యవసాయ రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయి. జిల్లాలో దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండగా, ఆదాయం భారీగా వస్తున్నది. మరోవైపు జిల్లా తలసరి ఆదాయం కూడా పెద్ద ఎత్తున పెరుగు తున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా దిశ, దశ మారుతుండగా సామాజిక ఆర్థిక సర్వే-2020 నివేదికలో ఇది స్పష్టంగా వెల్లడికావడం విశేషం.

  • మెరుగుపడిన తలసరి ఆదాయం
  • అన్ని రంగాల్లో దూసుకుపోతున్న జిల్లాలు
  • సాగునీటి ప్రాజెక్టులతో ఆయకట్టుకు నీరు
  • పథకాలతో వ్యవసాయ రంగంలో మార్పులు
  • మూడు జిల్లాల్లో 40 శాతానికిపై అడవులు
  • సామాజిక ఆర్థిక సర్వే-2020 నివేదిక వెల్లడి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నాలుగు జిల్లాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. ప్రతి ఏటా క్రమంగా ఉత్పత్తితో పాటు ఆదాయం వృద్ధి చెందుతున్నది. మరోవైపు నాలుగు జిల్లాల్లోనూ తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ, రైతులకు ఆర్థిక సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో వ్యవసాయ రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు ఇస్తుండడంతో వ్యవసాయ రంగం మరింత పుంజుకుంది. ప్రాజెక్టులు, చెరువులతో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఉత్పత్తి పెరిగి ఆదాయం వృద్ధి చెందుతున్నది. దీనికి అనుగుణంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కూడా వస్తున్నాయి. మరోవైపు పశుసంపద కూడా గణనీయంగా పెరగడంతో రైతుల జీవన ప్రమాణాలు పెరిగాయి. 


పెరిగిన ఉత్పత్తి, తలసరి ఆదాయం..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జిల్లా దేశీయ ఉత్పత్తి మొత్తం (గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌-జీడీడీపీ) క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకుగాను.. ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతున్నది. ప్రణాళిక వికేంద్రీకరణ చేపట్టగా అన్ని జిల్లాల్లో ఉత్పత్తి బాగా పెరుగుతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన దేశీయ ఉత్పత్తిని సామాజిక ఆర్థిక సర్వే-2020 నివేదికలో వెల్లడించారు. 2017-18లో నిర్మల్‌ జిల్లాలో రూ.11,200 కోట్లుకాగా.. 2018-18లో రూ.12,723 కోట్లకు చేరింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 2017-18లో రూ.11,854కోట్లు ఉండగా.. 2018-19లో రూ.13,427 కోట్లకు చేరింది. మంచిర్యాల జిల్లాలో 2017-18లో జీడీడీపీ రూ.12,001 కోట్లుకాగా.. 2018-19లో రూ.12,419 కోట్లకు చేరింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2017-18లో రూ.7699 కోట్లుకాగా.. 2018-19లో రూ.8855 కోట్లకు పెరిగింది. 2018-19లో రాష్ట్ర తలసరి ఆదాయం సగటున రూ.2,04,488కోట్లు ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 2017-18లో రూ.1,40,024కోట్లుకాగా..   2018-19లో రూ.1,56,940 కోట్లకు పెరిగింది. నిర్మల్‌ జిల్లాలో 2017-18లో రూ.1,22,538 కోట్లుకాగా.. 2018-19లో రూ.1,50,134కోట్లకు చేరింది. మంచిర్యాల జిల్లాలో 2017-18లో రూ.1,24,851కోట్లుకాగా.. 2018-19లో రూ.1,27,703 కోట్లకు పెరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2017-18లో రూ.1,27,734కోట్లుకాగా.. 2018-19లో రూ.1,44,930కోట్లకు చేరింది.


పూర్తయిన ప్రాజెక్టులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ర్యాలీవాగు, గొల్లవాగు, మత్తడివాగు, గడ్డెన్న సుద్దవాగు వంటి మధ్య తరహా ప్రాజెక్టులు జిల్లాలో ఉన్నాయి. వీటి నిర్వాసితులకు పరిహారం అందించి కాలువలు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో.. రూ.55.31కోట్లతో ర్యాలీ వాగు ప్రాజెక్టు నిర్మించారు. జలయజ్ఞంలో భాగంగా ఈపీసీ విధానంలో మంచిర్యాల మండలంలో నిర్మించారు. మంచిర్యాల పట్టణానికి 29 కి.మీ. దూరంలో భీమారం సమీపంలో రూ.107.93కోట్ల వ్యయంతో గొల్లవాగు ప్రాజెక్టును నిర్మించారు. ఇది మధ్యతరహా ప్రాజెక్టు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం వడ్డాయి వద్ద రూ.62.08కోట్ల వ్యయంతో మత్తడివాగు ప్రాజెక్టు నిర్మించారు. ఇది మధ్యతరహా ప్రాజెక్టు. పెన్‌గంగా ఉప పరివాహక ప్రాంతంలో ఉండగా.. జైనథ్‌, ఆదిలాబాద్‌, తాంసి మండలాల్లోని 12గ్రామాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించారు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణ సమీపంలో రూ.228.07కోట్ల అంచనా వ్యయంతో సుద్దవాగుపై గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిర్మించారు. ఇది కూడా మధ్యతరహా ప్రాజెక్టు. 


నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలు

2018 నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలోని జిల్లాలోని 1508 గ్రామ పంచాయతీల్లో రెండు విడతల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారు. మొదటి విడత సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5వరకు నెలరోజుల పాటు, రెండో విడత జనవరి 2 నుంచి 12వరకు పది రోజుల పాటు నిర్వహించారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం.. జిల్లాలోని 12మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పది రోజుల పాటు నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, ఆదాయ-వ్యయాలపై దృష్టి, ఆదాయ వనరుల సమీకరణ వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకో శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డుల నిర్మాణం, నర్సరీల ఏర్పాటుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. ఏడాది, ఐదేండ్ల ప్రణాళికలు రూపొందించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తుండగా.. గ్రామ పంచాయతీల్లో జనాభా ఆధారంగా నెలానెలా 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. 


మూడు జిల్లాల్లో 40 శాతానికిపైగా అడవులు..!

రాష్ట్రంలో సగటున 24శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అడవుల నరికివేత, స్మగ్లింగ్‌, అడవుల ఆక్రమణ వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది.  రాష్ట్రంలో 26,969.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉండగా.. మొత్తం భూభాగంలో 24శాతం అడవులు ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో 50శాతానికిపైగా అడవులు ఉండగా అందులో కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కూడా ఉంది. ఈ జిల్లాలో 50.15శాతం మేర భూభాగంలో అడవులు విస్తరించి ఉన్నట్లు సర్వేలో తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 41.53 శాతం, నిర్మల్‌ జిల్లాలో 31.64శాతం, మంచిర్యాల జిల్లాలో 45.94 శాతం మేర అడవుల విస్తీర్ణం ఉన్నట్లు వెల్లడించారు. 


ఏకో టూరిజంతో పర్యాటకుల సందడి

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు ప్రఖ్యాత జలపాతాలు ఉన్నాయి. నేరడిగొండ మండలం కుంటాల, బోథ్‌ మండలం పొచ్చెర వద్ద ఉన్న జలపాతాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కుంటాల జలపాతం పూర్తి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండగా.. వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉంది. నిర్మల్‌కు 37కి.మి. దూరంలో పొచ్చెర జలపాతం 20 మీటర్ల ఎత్తులో ఉంది. గట్టి రాయితో ఉన్న ఈ జలపాతం.. పచ్చని చెట్ల మధ్య ఉంది. పచ్చని చెట్లు, రకరకాల పక్షులు, కీటకాలతో ఈ జలపాతం పర్యాటకులను అలరిస్తున్నది.


పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో రెండు టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులున్నాయి. నల్లమల వద్ద ఉన్న అమ్రాబాద్‌, మన జిల్లాలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు ఉంది. ఈ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు 2015.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 892.13 చ.కి.మీ. కోర్‌ ఏరియా, 1123 కి.మీ. మేర బఫర్‌ ఏరియాలో ఇది విస్తరించి ఉంది. ఇది మహారాష్ట్రలోని తాడోబా అంధేరీకి, ఛత్తీస్‌ఘడ్‌ ఇంద్రావతి టైగర్‌ రిజర్వు ఫారెస్టుకు మధ్య ఉంది. తాడోబా, ఇంద్రావతి నుంచి కవ్వాల్‌కు పులులు వచ్చి వెళ్తున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ ఫారెస్టు డివిజన్లతో కలిసి ఈ పులుల కారిడార్‌ విస్తరించి ఉంది. నాలుగు పులులు బఫర్‌ ఏరియాలో, రెండు పులులు కోర్‌ ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో ఒక పులి నాలుగు పిల్లలతో ఉన్నట్లు కెమెరాకు చిత్రాలు చిక్కాయి.


సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో మహర్దశ

రైతాంగానికి సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో నీటి వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రైతులకు సకాలంలో సాగు నీరు ఇవ్వడంతో పాటు గృహ అవసరాలకు, పరిశ్రమలకు కూడా నీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. కడెం, సదర్మాట్‌ ఆనకట్ట, సాత్నాల, ఎన్టీయార్‌ సాగర్‌, స్వర్ణ, చెలిమెల వాగుతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మించే చనకా-కొరటా బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన-పీఎంకేఎస్‌వై పథకం ద్వారా జిల్లాలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పనులు చేపట్టి.. పూర్తి స్థాయిలో ఆయకట్టును స్థిరీకరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కాలువలు, చెక్‌డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు.  


ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయగా.. లింక్‌-7ద్వారా ఎస్సారెస్పీ వెనకభాగం నుంచి నిర్మల్‌ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్‌(ప్యాకేజీ-27), ముథోల్‌ నియోకవర్గంలోని తానూర్‌ మండలం హంగిర్గా(ప్యాకేజీ-28)ల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పనులు చేపట్టారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును 20.175 టీఎంసీల సామర్థ్యంతో రూ.5837.48కోట్లతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2.20లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత పరివాహక ప్రాంతం (గోదావరి ఉప పరివాహక ప్రాంతం)లో పెద్ద వాగుపై నీల్వాయి ప్రాజెక్టును నిర్మించారు. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో 13వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించగా.. ఇందుకోసం రూ.211.32కోట్లుగా అంచనా వ్యయం వేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దవాగుపై జగన్నాథపూర్‌ ప్రాజెక్టును రూ.244.66కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 9750మందికి తాగునీరు అందించేలా దీన్ని డిజైన్‌ చేశారు. 29 కి.మీ. కుడి ప్రధాన కాల్వ నిర్మించగా.. ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌ మండలం ఆడ వద్ద పెద్దవాగుపై కుమ్రంభీం ప్రాజెక్టును రూ.882.31కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఆసిఫాబాద్‌, వాంకిడి, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లోని 45,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 


logo