మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Mar 15, 2020 , 02:57:30

ఆరు గంటలు.. 19 అంశాలు

ఆరు గంటలు.. 19 అంశాలు
  • సుధీర్ఘంగా జిల్లా పరిషత్‌ సమావేశం
  • ఏజెండాలో పలు అంశాలపై లోతైన చర్చ
  • తొలిసారిగా సమావేశానికి హాజరైన కలెక్టర్‌
  • ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి : జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా పరిషత్‌ సర్వసభ్య మూడో సమావేశం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగా సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవసేనతో పాటు అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) డేవిడ్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భావేశ్‌ మిశ్రా జడ్పీ సమావేశానికి మొదటిసారి హాజరయ్యారు. సుధీర్ఘంగా ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సభ్యులు ఏజెండాలోని 19 అంశాలపై చర్చించారు. ఏండాకాలం నేపథ్యంలో తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా మిషన్‌ భగీరథపై మొదటగా చర్చించారు. అనంతరం విద్య, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పంటల కొనుగోళ్లు, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్‌, గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్‌, విద్యుత్‌, గ్రామీణాభివృద్ధి,  రెవెన్యూ ప్రగతి, అటవీశాఖ, పరిశ్రమల శాఖ, దళిత అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంస్థ, మైనార్టీ సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై  చర్చ నిర్వహించారు. 

 జిల్లాల విభజన అనంతరం 17 మండలాలతో ఏర్పడిన జిల్లా పరిషత్‌లో తక్కువ మంది సభ్యులు ఉండడంతో అందరికీ తమ ప్రాంతాల సమస్యలపై చర్చించే అవకాశం లభించింది. మొదటి సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యల పరిష్కారం వివరాలను అధికారులు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు అధికారులు సమాధానం చెప్పారు. సమావేశానికి ముందు గత సమావేశాల్లో తాము అడిగిన సమస్యలను పరిష్కరించారా లేదా అనే విషయాలను తమకు నోట్‌ రూపంలో ఇవ్వాలని సభ్యులు కోరారు. దీంతో తిరిగి ఆ సమస్యలను ప్రస్తవించకుండా ఉండే అవకాశం ఉంటుందని, సమయం సైతం వృథా కాదన్నారు. స్పందించిన కలెక్టర్‌ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ మండలాల్లోని వివిధ శాఖలకు చెందిన సమస్యలను అధికారులు, కలెక్టర్‌, జడ్పీ చైర్మన్లకు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు సభ్యులకు సూచించారు. సమస్యలను రాసుకోని వాటిని పరిష్కరిస్తామన్నారు. సభ్యులు ప్రస్తావించిన  పలు సమస్యల పరిష్కారం కోసం జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, కలెక్టర్‌ శ్రీదేవసేన వివిధ శాఖల అధికారులు పలు సూచనలు చేశారు. 


logo