సోమవారం 30 మార్చి 2020
Adilabad - Mar 09, 2020 , 23:36:35

చిగురించిన ‘తునికి’

చిగురించిన ‘తునికి’

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ అటవీ శాఖ డివిజన్లు ఉండగా ఏటా ఎండాకాలంలో యూనిట్ల వారీగా తునికాకు సేకరణ నిర్వహిస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యూనిట్ల వారీగా టెండర్లు పిలిచి విక్రయాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ డివిజనల పరిధిలో ఈ ఏడాది 14 యూనిట్ల ద్వారా తునికాకును సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ యూనిట్లలో ఆకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5,700 స్టాండర్డ్‌ బ్యాగులను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్కో స్టాండర్డ్‌ బ్యాంగులో వేయి కట్టలు ఉంటాయి. వివిధ గ్రామాల్లోని అటవీ ప్రాంతాల సమీపంలో కూలీలకు అందుబాటులో ఉండే విధంగా 150 కల్లాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది తునికాకు సేకరణకు అటవీశాఖ అధికారులు టెండర్‌ ప్రక్రియను ప్రారంభించారు. కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేసేందుకు ఈ నెల 2 నుంచి 23వరకు గడువు విధించారు. వివిధ ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన యూనిట్లను కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు తునికాకును సేకరించాల్సి ఉంటుంది. వీరు ఆయా ప్రాంతాల్లో కల్లాల వారీగా కల్లెదార్లను నియమించుకొని తునికాకును కొనుగోలు చేస్తారు. తునికాకు సేకరణలో భాగంగా  అటవీ ప్రాంతాల్లో  ఉన్న చెట్లకు కొమ్మ కొట్టడం చేపడుతారు. ఫలితంగా తునికి చెట్ల నుంచి నాణ్యమైన ఆకు వస్తుంది. 

ఎండాకాలంలో కూలీలకు ఉపాధి..

జిల్లాలో ఎండాకాలంలో అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ ద్వారా కూలీలకు ఉపాధి లభించనుంది. ఆకును సేకరించేందుకు గ్రామీణులు ఉదయం సమయంలో అడవులకు వెళ్తారు. దాదాపు మూడు గంటల పాటు అడవీలో సేకరించిన ఆకును ముల్లెలు కట్టుకుని వారి ఇండ్లకు చేరుకుంటారు. ఆ ఆకులను కుటుంబ సభ్యులతో కలిసి కట్టులు కడుతారు. ఇలా కట్టిన తునికి కట్టలను గ్రామాల్లో ఏర్పాటు చేసిన తునికి కల్లాల్లో విక్రయిస్తారు. ఇలా ఒక్కో కుటుంబానికి  రోజుకు రూ. వేయ్యి దాకా కూలీ గిట్టుబాటు అవుతుంది. జిల్లాలో బీడీ కార్మికులు సైతం ఉండడంతో వారు ఆకును తీసుకువచ్చి ఇండ్ల వద్ద ఎండబెట్టిన తర్వాత బీడీలు తయారు చేస్తారు. 

5,700 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ..

జిల్లా వ్యాప్తంగా 150 కల్లాలను ఏర్పాటు 5,700 స్టాండర్డ్‌ బ్యాగులను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు 14 యూనిట్లు ఏర్పాటు చేయగా ఆదిలాబాద్‌ (ఏ) యూనిట్‌లో 300 స్టాండర్డ్‌ బ్యాగులు, బేల లో 200 బ్యాగులు, లోకారి(ఏ)లో 200 బ్యాగులు, లోకారి (బీ)లో 600  బ్యాగులు, ఇంద్రవెల్లిలో 700  బ్యాగులు, నార్నూర్‌లో 900  బ్యాగులు, ఉట్నూర్‌లో 700  బ్యాగులు, సొనాల (బీ)లో 100  బ్యాగులు, తర్నంలో 100  బ్యాగులు, దస్నాపూర్‌ (బీ)లో 500  బ్యాగులు, సిరిచెల్మ (ఏ)లో 400  బ్యాగులు, తర్నం (ఏ)లో 200  బ్యాగులు, వడ్‌గాం (ఏ) యూనిట్‌లో 600  స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకు సేకరించేందుకు అటవీశాఖ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


logo