యేటా వివిధ జాతరల సందర్భంగా నిర్వహణ
పోటాపోటీగా తలపడుతున్న మల్లయోధులు
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పోటీదారులు
మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో రాక
తిలకించేందుకు స్థానికుల ఆసక్తి
నిర్మల్ టౌన్/ కుభీర్, మార్చి 20 : కండబలంతో వేగంగా దూసుకొస్తున్న మరో బలాఢ్యుడిని వేగంగా పరుగెత్తి అడ్డుకొని, ఎత్తుకు పైఎత్తు చిట్కాలతో వెల్లకిలా చేయడం కుస్తీ పోటీల్లో ప్రధానం. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఏటా పండుగలు, జాతరల సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఎక్కడ పోటీలు నిర్వహించినా మల్లయోధులతో పాటు వారిని ప్రోత్సహించేందుకు జనం కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కుంటాల మండలంలోని ఓలా, సూర్యాపూర్, కుభీర్ మండలంలోని పార్డి, కుభీర్ మండల కేంద్రం, మగగాం, తానూరు మండల కేంద్రంతో పాటు భోసి, మొగ్లి, ముథోల్ మండలంలోని ఎడ్బిడ్, తదితర ప్రాంతాల్లో యేటా కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, మే నెల చివరి వరకు నిర్వహిస్తుంటారు. పోటీలు ఆద్యంతం అలరిస్తుండగా, వీక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలతో మల్లయోధుల్లో ఉత్సాహం నింపుతుంటారు. విజేతను భుజాన ఎత్తుకొని ప్రాంగణంలో చక్కర్లు కొడతారు. పోటీలకు ముందు ప్రకటించినట్లుగా విజేతకు నగదు బహుమతి అందించి సత్కరిస్తారు.
పట్టుదలతో రాణిస్తున్నా
చిన్నప్పటి నుంచి ఈపోటీలపై మక్కువ పెంచుకొని ఆసక్తితో మెళకువలు (అట్కలు) నేర్చుకొని పట్టుదలతో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో విజయం సాధిస్తున్నా. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. మహారాష్ట్రలో ప్రభుత్వం మాకెలాంటి ప్రోత్సాహం అందించదు. అయినా మాకు ఇష్టం ఉండడంతో కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపైనా, ఓటమినైనా స్వీకరించి వెళతాం. మా రాష్ట్రంతో పాటుతెలంగాణలోనూ ఈ పోటీలకు ప్రాధాన్యం ఉంది. అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే ఆ ఆనందమే వేరు.
సాంగే దిలీప్ కిషన్, బామ్ని, మహారాష్ట్ర 70 ఏళ్లు వచ్చినా పోటీలకు..
నా వయస్సు 70 ఏళ్లు. 30 ఏళ్ల నుంచే కుస్తీ పట్టడం నేర్చుకున్నా. జిల్లాలో ఎక్కడ కుస్తీ పోటీలు నిర్వహించినా తప్పకుండా వెళ్తా. పోటీల్లో ప్రత్యర్థితో కుస్తీ పడుతా. ధోతి కట్టుకొని కుస్తీ పట్టి గెలిచినా, ఓడినా పోటీల్లో పాల్గొన్నందుకే చాలా తృప్తి అన్పిస్తది. కుస్తీ పట్టడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాయి. ఇప్పటివరకు సుమారు 50సార్లు కుస్తీ పట్టగా.. 30సార్లు గెలిచిన.. 20సార్లు ఓడిన. వయస్సు మీద పడుతున్నా కుస్తీ మాత్రం మరువలేకపోతున్నా. -దిగంబర్, తానూర్
మహారాష్ట్ర నుంచి వచ్చినం..
మాది మహారాష్ట్రలోని జల్ధార ప్రాంతం. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో దేవతా ఉత్సవాల్లో కుస్తీ పోటీలు జరుగుతుండడంతో యేటా ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నా. చిన్నప్పటి నుంచే ప్రత్యర్థులను ఎలా ఓడించాలో మా గురువు రాంజీ వద్ద నేర్చుకున్నా. కుస్తీకి బలంతో పాటు మేథోశక్తి కూడా తప్పనిసరిగా ఎంతో అవసరం. ఇందుకోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకుంటాం. గెలుపోటములు సహజమే అయినా, పోటీల్లో పాల్గొనడమే నాకు ప్రధానం. మహేందర్, జల్ధార 20సార్లు గెలిచిన..
నేను ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నా. మా గ్రామంతో పాటు తానూరు, కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా నా మిత్రులతో కలిసి వస్తా. కుస్తీ పోటీల్లో ప్రత్యర్థులతో తలపడుతా. ఒక్కోసారి ఓడినా అధైర్యపడకుండా మళ్లీ కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నా. ఇప్పటివరకు 20సార్లు గెలిచిన. రూ. 50 నుంచి ప్రారంభమైన ఈ కుస్తీ పోటీ బహుమతి ఇప్పుడు రూ. వెయ్యి వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నా. కుస్తీ పోటీల్లో పాల్గొన్నవారికి ప్రేక్షకులు మంచి ఆదరణ, ప్రోత్సాహం అందిస్తున్నారు. గెలుపొందిన వారిని భుజాలపై ఎత్తుకొని అభినందిస్తున్నారు.
మాధవరావు, బిద్రెల్లి