బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Mar 08, 2020 , 00:02:39

కరోనా భయం వద్దుకంది రైతు బందీ

 కరోనా భయం వద్దుకంది రైతు బందీ

తాంసి :  వ్యవసాయ మార్కెట్లలో దళారులు గద్దల్లా వాలుతున్నారు. పంట ఏదైనా రైతుల పేరుతో కొనుగోళ్లు సాగిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రభుత్వం దళారులు, ప్రైవేటు వ్యాపారులు తెచ్చిన పంటలను కట్టడి చేయడానికి ఆన్‌లైన్‌ క్రాఫ్‌ బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. అయితే దళారులు అందుకు రైతులను అడ్డు పెట్టుకొని యధావిధిగా వారి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. పత్తి, కంది పంటలు ఏవైనా రైతులను మధ్య ఉంచి దళారులు ప్రతి రోజూ సులభంగా ఇతర ప్రాంతాల నుంచి సరుకును తెచ్చి విపణిలో అమ్ముకొని వెళ్తున్నారు.


రైతు పేరుతో విక్రయాలు.. 

జిల్లాలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, బేలా, తాంసి, ఇచ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌ కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ ద్వారా కందులు కొనుగోళ్లు జరుపుతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న దళారులు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన  కందులను మార్క్‌ఫెడ్‌కు అమ్మి ప్రతి రోజూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కందులు పండించిన రైతులు తమ పంటను మార్కెట్‌లో అమ్ముకోగా.. కంది పంట వేయని రైతులకు సంబంధించిన పాస్‌బుక్కులను తీసుకొని దళారులు కందుల దందా కొనసాగిస్తున్నారు. జిల్లా రైతులు పత్తి, సోయాబీన్‌, కంది పంటలు సాగు చేస్తున్నారు. కేవలం రైతులు మాత్రమే రావాలని చెబుతుండడంతో దళారులు మాత్రం వానాకాలం సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇచ్చిన రైతుల పేరున అమ్మకాలు యధావిధిగా సాగిస్తున్నారు.


పాస్‌బుక్కులు ఇవ్వకుంటే గింజలకు కరువు.. 

జిల్లాలో వ్యవసాయం చేస్తున్న రైతులు దళారీ వ్యవస్థపై ఆధారపడిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌ వ్యవసాయం మొత్తం దళారుల కంబంద హస్తాల్లో బందీ అయిన పరిస్థితి. బ్యాంకులు రుణాలు ఇచ్చినా రైతులు దళారులనే నమ్ముకోవాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరా చేసుకున్న దళారులు ఇంతకు ముందు మార్కెట్లలో పంటలను వారి ఫార్మ్‌ పేరుతో అమ్మేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. రైతులు మాత్రమే అమ్మేలా కట్టడి చేయడంతో దళారులు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు కందుల కొనుగోళ్ల సందర్భంగా వారికి మార్కెట్లలో అమ్మకాలు సాగించడానికి ఇబ్బంది ఏర్పడుతున్నది. ఈ పరిస్థితుల్లో వారు బాకీ ఇచ్చిన రైతుల పేరున కందులు విక్రయిస్తున్నారు. చాలా మంది రైతులు వారి సరుకు అమ్ముకుంటున్నా.. పడావు భూములు, దిగుబడి రాని రైతుల పేరున యధావిధిగా అమ్మకాలు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవేళ రైతులు దళారులకు పాస్‌బుక్కులు ఉండి ఇవ్వకుంటే మరుసటి ఏడాది వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఈ ప్రాంత రైతులు భయపడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో దళారులకు తమ పాస్‌బుక్కులను ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.


తనిఖీ చేసినా తప్పించుకుంటున్న దళారులు.. 

జిల్లాలో జరుగుతున్న కంది కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ, మార్కెటింగ్‌ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ రైతులు, వ్యాపారులు తెచ్చిన కందులు ఏవో తెలియక అధికారులు హైరానా పడుతున్నారు. దళారులు సంబంధిత రైతులను నయాన్నో భయాన్నో సంబంధిత పట్టాపాస్‌బుక్‌తో మార్కెట్‌కు రప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఏమైనా అంటే గొడవలకు దారి తీస్తుందని అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదను చేసుకున్న దళారులు వారి అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం ఆదిలాబాద్‌ మార్కెట్‌లో అదనపు కలెక్టర్‌ తనిఖీకి ముందు కందులు తెచ్చిన దళారి సంబంధిత వ్యక్తితో గొడవకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి విషయం గమనించి అధికారులతో మాట్లాడి వాటిని సీజ్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. తనిఖీలు చేయడానికి వచ్చిన అధికారులకు కూడా దొరక్కుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దళారులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు.


logo
>>>>>>