గురువారం 09 ఏప్రిల్ 2020
Adilabad - Mar 06, 2020 , 00:14:07

కరోనా.. నహీ డర్నా

కరోనా.. నహీ డర్నా

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స అందించడానికి రిమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. దవాఖానలో 24 గంటలు చికిత్స అందేలా వైద్యులను అందుబాటులో ఉంచారు. వ్యాధి విస్తరించకుండా ఉండేందుకు మాస్క్‌లు, మందులను అందుబాటులో ఉంచారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ బస్‌ డిపో నుంచి వివిధ ప్రాంతాలను వెళ్లి బస్సులను శుభ్రం చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ అధికారులు  మాస్క్‌లు అందించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. 


కరోనాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అధికారులు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్‌-19ను నివారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లాలో అనుమాతులు ఏవరైనా ఉంటే వారికి తక్షణ చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ దవాఖానలో ఆరు బెడ్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా వైద్యులను నియమించారు. అవసరమైతే ఇతర దవాఖానల నుంచి నిపుణులు కూడా రిమ్స్‌లో సేవలు అందేంచేలా చర్యలు తీసుకుంటామని, కరోనా వైరస్‌ నిరోధించేందుకు అవసరమైన మందులు, కృత్రిమ శ్వాస అందించే పరికరాలు అందుబాటులో ఉన్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ తెలిపారు.


అవగాహన కార్యక్రమాలు.. 

జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ ఆర్‌ఎం విజయభాస్కర్‌, అధికారులు డ్రైవర్లు, కండక్టర్‌లకు మాస్క్‌లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌, గుంటూరు, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. విధులు నిర్వహించే ఆర్టీసీ సిబ్బంది మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కొవిడ్‌-19 ప్రభావం ఉండకుండా సిబ్బంది బస్సులను శుభ్రం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పట్టణంలో పలు వార్డుల్లో అధికారులు, వైద్యసిబ్బందితో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానికులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన వాటిపై సలహాలు, సూచలను అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానికులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. 


logo