శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Mar 06, 2020 , 00:11:29

బీఎస్‌-4కి డెడ్ లైన్

 బీఎస్‌-4కి డెడ్ లైన్

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : వాహనాలతో ఏర్పడే కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని, ఇంది అనేక వ్యాధులకు మూలమవతున్నాయని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ వాహనాలతో ఇంకా అనేక అనర్థాలు జరుగుతున్నాయని భావించి బీఎస్‌ -4 వాహనాల అమ్మకాలకు గడు వు విధించింది. బీఎస్‌-4 వాహనాలన్నీ ఈనెల 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనే నిబంధన పెట్టింది. దీంతో తమ వద్ద ఉన్న స్టాకు ను విక్రయించేందుకు వివిధ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. వివిధ కంపెనీలు పోటీ పడి మరీ ధరలను తగ్గించాయి. దీంతో నిత్యం జిల్లా లో వందల సంఖ్యలో వాహనాల అమ్మకాలు జరుగుతుండగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. రిజిస్ట్రేషన్లకు గడువు ఈనెల 31వ తేదీగా ప్రకటించడంతో వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. 


ఈనెల 31 చివరి గడువు..

కాలుష్య నివారణకు బీఎస్‌-4 వాహనాలపై ఇటీవల సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాహనాల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు ఈనెల 31వ తేదీ వరకు చేయించుకోవాలని సూచించింది. గడువు దాటితే వాహనాలను స్క్రాప్‌ కింద లెక్క కడుతామని పేర్కొంది. దీంతో వివిధ కంపెనీలు వాహనాల ధరలను తగ్గించాయి. కాగా.. జిల్లాలోని వివిధ కంపెనీల 17 షోరూమ్‌  డీలర్లు పోటీ పడి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. హీరో, హోండా, బజాజ్‌ పల్సర్‌, యాక్టీవా, వివిధ ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు, లారీల ధరలు తగ్గించారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కొక్క కంపెనీ మార్కెట్‌ ధరకంటే రూ.10వేల నుంచి రూ.15 వేల వరకు తగ్గించారు. ఇక కార్లపై రూ. 50 వేల నుంచి రూ.70 వేలకు పైగానే డిస్కౌండ్‌( మినహయింపు) ఇస్తున్నారు. ఏ షోరూం వెళ్లినా ప్రత్యేక ఆఫర్ల బోర్డులు దర్శనమిస్తున్నాయి. వినియోగదారులు ఎగబడి మరీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు ఈనెల 31కి చివరి గడువు ఉండగా.. జిల్లా కేంద్రంలోని రవాణ శాఖ కార్యాలయానికి తండోపతండాలుగా తరలివచ్చి క్యూ కడుతున్నారు. ఇంతకు ముందు సగటున రోజుకు 50 వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ప్రస్తుతం రోజూ వందల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో తీరక లేకుండా అధికారులు విధుల్లో నిమగ్నమవుతున్నారు. 


ఏప్రిల్‌ ఒకటి నుంచి 

బీఎస్‌-6 వాహనాలు.. 

బీఎస్‌-4 వాహనాలపై నిషేధం విధించడంతో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-6 వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో బీఎస్‌-4 వాహనాల ధరలను కంపెనీలు తగ్గించాయి. షోరూమ్‌లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒక రకంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ అనేది ఈ పెళ్లిళ్ల సీజన్‌ కాలంలో రావడం అందరికీ కలిసి వచ్చిన అంశంగా మారింది. బీఎస్‌-4 వాహనాలను షోరూం ధరకంటే తక్కువ ధరకే లభిస్తుండడంతో వినియోగదారులు అదృష్టంగా భావిస్తున్నారు. బీఎస్‌-6 వాహనాల ధరలు ఎక్కువగా ఉండే అవకాశమూ ఉండడంతో ఇప్పుడే ఈ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు కొత్త వాహనాలను (బీఎస్‌-6) మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇవి రానుండగా ఇప్పటికే డెమో ప్రదర్శించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండే కొత్త వాహనాల ధరలెలా ఉంటాయో అని కూడా ప్రస్తుతం బీఎస్‌-5 స్టాకు కేకుల్లా అమ్ముడయ్యే అవకాశం కనిపిస్తున్నది. కాగా.. ప్రస్తుతం బీఎస్‌-4 వాహనాలు కార్బన్‌డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోకార్బన్‌ వదలడంతో వాతావరణ కలుష్యం ఏర్పడుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వాహనాలపై నిషేధం విధించింది. పొల్యూషన్‌ లేని వాహనాలను తయారు చేయాలని వివిధ కంపెనీలు సూచించింది. ఈ నేపథ్యంలో కంపెనీలు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ (నిబంధనలు) ప్రకారం బీఎస్‌-6ను తయారు చేశారు. ఈ వాహనాల ఇంజిన్‌ మార్పు చేయడంతో పాటు ఇంధనంలో వాడే రసాయనాలను తగ్గిస్తున్నారు. లీటర్‌ పెట్రోల్‌కు కంపెనీల వాహనాలను బట్టి మైలేజ్‌ కూడా ఎక్కువ ఇస్తున్నది. పొల్యూషన్‌ కూడా తక్కువ ఉంటుంది. ఇవి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. logo