బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 06, 2020 , 00:05:07

టార్గెట్‌ @ 6.31కోట్లు

టార్గెట్‌ @ 6.31కోట్లు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  ఆస్తి పన్నుల వసూళ్లకు బల్దియా యంత్రాంగం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.6.31 కోట్లు టార్గెట్‌ ఉండగా ఇప్పటి వరకు 4.71 కోట్లు వసూలు అయ్యాయి. 74.78 శాతంగా నమోదయ్యింది.  ఆర్థిక సంవత్సరానికి గడువు 25 రోజులు ఉండగా ఇంకా 1.60 కోట్లు వసూలు కావా ల్సి ఉంది. వంద శాతం వసూలు కోసం బల్దియా అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఎనిమిది మం ది బిల్‌ కలెక్టర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. బల్దియా కార్యాలయంలో పన్నుల సేకరణ కోసం ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 


అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌..

విలీన గ్రామాలతో పాటు పాత మున్సిపల్‌ పరిధిలోని వార్డులు కలిపి మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఈ ఏడాది బల్దియా టార్గెట్‌ రూ.6.31 కోట్లు ఉంది. గురువారం వరకు 4.71కోట్లు వసూలు అయ్యాయి. గడువు సమీపిస్తుండగా.. అధికారులు వంద శాతం పన్నులను వసూలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి చర్యలు చేపట్టారు. బకాయిదారులకు సోషల్‌ మీడియా, మైక్‌ ద్వారా పన్ను చెల్లించాలని ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం గడువు సమీపిస్తుండడంతో అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ను చేపట్టారు. బిల్‌ కలెక్టర్లు, అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్లకు వార్డులను కేటాయించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటింటింకీ వెళ్లి పన్నులను సేకరిస్తున్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. వారికి ముందుగా డిమాండ్‌ నోటీసులు ఇస్తున్నారు. స్పందించని పక్షంలో రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు అందిన మూడు రోజుల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మున్సిపల్‌ యాక్టు ప్రకారం శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నారు. 


మిగిలింది 25 రోజులే..

బల్దియాకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్నులు. పన్నులు వసూలు అయితేనే పట్టణం అభివృద్ధి సాధ్యం. గతేడాది టార్గెట్‌ 6.27 కోట్లు కాగా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రూ.6.65 కోట్లు వసూలు అయ్యాయి. 96.65 శాతానికి చేరుకున్నది. ఈ ఏడాది టార్గెట్‌ రూ.6.31 కోట్లు ఉండగా ఇప్పటివరకు కేవలం 74.78 శాతం మాత్రమే వసూలు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరపడుతుండడంతో పన్నుల వసూళ్లను వేగవంతం చేశారు. బిల్‌కలెక్టర్లకు రోజు వారీగా టార్గెట్లను విధించారు. మొండి బకాయిదారుల ఇంటి వద్ద డప్పుతో చాటింపు వేయిస్తున్నారు. డిమాండ్‌ నోటీసులను ఇస్తూ పన్నులు చెల్లించాలంటూ ఆదేశిస్తున్నారు. గడువులోగా చెల్లించని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్నులు కూడా పేరుకుపోయాయి. దీంతో ఆయా శాఖల అధికారులకు బల్దియా నుంచి నోటీసులు పంపుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులు పన్నులు చెల్లించారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆర్‌వో జాదవ్‌ కృష్ణ తెలిపారు.


logo