బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 04, 2020 , 23:31:54

పట్టణ ప్రగతి సక్సెస్‌

పట్టణ ప్రగతి సక్సెస్‌

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : మురికిమయంగా మారిన పట్టణాల్లో చెత్తచెదారాన్ని తొలగించి, పచ్చదనం పెంపొందించడం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లాంటి ఇతర కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విజయవంతమైంది. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో ఈ కార్యక్రమం గత నెల 24న ప్రారంభంకాగా పది రోజుల పాటూ బుధవారం వరకు కొనసాగింది. పట్టణ ప్రగతిని పకడ్బందీగా అమలు చేసేందుకు వార్డుకు ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. కౌన్సిలర్లు, స్థానికులతో కలిసి ప్రత్యేకాధికారులు పది రోజుల పాటు ముందుగా తయారు చేసిన పది రోజుల షెడ్యూల్‌లో భా గంగా వివిధ పనులు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే వార్డులకు చేరుకొని పరిశుభ్రత  పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీదేవసేన, ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ వార్డుల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశుభ్రత, పచ్చదనంలో భాగంగా చేపడుతున్న పనులను పర్యవేక్షించారు.  


పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు.. 

పట్టణ ప్రగతిలో భాగంగా అధికారులు, కౌ న్సిలర్లు, స్థానికులతో కలిసి వార్డుల్లో  వివిధ కా ర్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్రలు ని ర్వహించి స్థానికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వార్డుల్లో రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలు, వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలను గుర్తించి తొలగించారు. వార్డుల్లో మురికి కాల్వలను శుభ్రం చేయించారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి, శుభ్రం చేసేలా చర్యలు తీసుకున్నారు. 


పబ్లిక్‌ స్థలాలను, ప్రజా సముదాయ ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు శ్రమదానం చేశారు. శిథిలావస్థకు చేరిన, ప్రమాదకరంగా మారిన ఇండ్లను గుర్తించి వాటిని కూల్చివేయడం కోసం యజమానులకు నోటీసులు జారీ చేశారు. వార్డుల్లో వట్టిపోయి పనికిరాకుండా ఉన్న బోరుబావులను పూడ్చివేశారు. వీటితో పాటు పట్టణంలోని వివిధ వార్డుల్లో వంగిన, తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాలను గుర్తించి తొలగించారు. వేలాడే విద్యుత్‌ వైర్లను సరిచేయడంతో పాటు మూడో విద్యుత్‌ వైర్లను బిగించారు. హరితహారంలో నాటిన మొక్కలు చనిపోగా వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటారు. మెక్కల పెంపకం కోసం నర్సరీలను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. పార్కుల ఏర్పాటు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించే కార్యక్రమాలను చేపట్టారు. ప్లాస్టిక్‌ నిషేధంపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. మార్కెట్‌, పార్కింగ్‌ స్థలాలు, ఓపెన్‌ జిమ్‌, ఆట స్థలాలు, శ్మశాన వాటికల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి వార్డుల్లో  స్థానికులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి సమస్య నివేదికలు తయారు చేశారు. ఆయా వార్డుల అభివృద్ధి కోసం నాలుగు కమిటీలనూ ఏర్పాటు చేశారు.


ప్రజల భాగస్వామ్యం.. 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు భాగస్వాములయ్యారు. అధికారులతో కలిసి వివిధ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలకు హాజరై అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించారు. పచ్చదనం - పరిశుభ్రతలో భాగంగా అధికారుల సలహాలు, సూచనలు పాటించారు. వార్డుల్లో నిర్వహించిన శ్రమదానంలో పాల్గొని పరిశుభ్రత కోసం తమ వంతు సహకారాన్ని అం దజేశారు. ప్రతి వార్డులో యువజన, మహిళ, సీనియర్‌ సిటిజన్‌, ఇతర కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో 15 మంది సభ్యులుగా ఉన్నారు. వార్డుల్లో క్రమంగా పరిశుభ్రత పనులు జరిగేలా చూడడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం వీరి బాధ్యతగా గుర్తించారు. తమ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తాము నిరంతరం కొనసాగిస్తామని స్థానికులు అంటున్నారు.


పదో రోజూ ముమ్మరంగా.. 

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతి చివరి రోజు బుధవారం ముమ్మరంగా సాగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజానీ, మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు వార్డుల వారీగా కౌన్సిలర్లు పర్యటించారు. మురికి నాలాల పూడిక తీత, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల తొలగింపు, పాడుబడ్డ బంగ్లాల కూల్చివేత తదితర కార్యక్రమాలను చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న కరెంట్‌ స్తంభాలను తొలగించి కొత్తగా స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మాట్లాడుతూ.. అందరి సహకారంతో పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. పదిరోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంతో పట్టణవాసులకు సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించి అప్పటికప్పుడు పరిష్కారించామన్నారు. పట్టణ ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారివేయొద్దని సూచించారు. వార్డు ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


logo