మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Mar 04, 2020 , 23:30:11

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఆదిలాబాద్‌ రూరల్‌ :జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షలను నిర్వహించారు. ఉదయం నుంచే విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు పంపించడానికి వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు. చాలా మంది పోషకులు తమ పిల్లలను పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి భయం లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి పరీక్షలకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి కేంద్రాల్లోకి పంపించడం కనిపించింది. మొదటి రోజు నిర్వహించిన పరీక్షకు జనరల్‌ విభాగంలో10,327 మంది విద్యార్థులు హాజరుకాగా, ఒకేషనల్‌ విభాగంలో 993మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జనరల్‌లో 480, ఒకేషనల్‌ విభాగంలో 199 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారి దస్రు నాయక్‌ తెలిపారు. ఇంటర్‌ ప్రథమ పరీక్ష రోజు మొత్తం 94.34శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఎక్కడా మాస్‌కాపీయింగ్‌ కేసులు నమోదు కాలేదని అన్నారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను డీఐడీవో దస్రూనాయక్‌ తనిఖీ చేశారు. 


పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు..

ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని పరీక్ష కేంద్రం వద్ద అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు అందుబాటులో ఉన్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థుల కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ తరఫున ప్రత్యేకంగా ఏఎన్‌ఎంలకు విధులు కేటాయించారు. వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జ్వరం, విరోచనాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు ప్రతి గది వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు. 


ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలవద్ద హడావుడి.. 

ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా పరీక్షకు ఒక్క నిమిషం గండం ఉండడంతో విద్యార్థులు ఎక్కడ పరీక్ష నష్టపోతామోనని విద్యార్థులందరూ 8.30లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తమ పిల్లలను పరీక్షా కేంద్రానికి పంపించడానికి తల్లిదండ్రులు సైతం తరలిరావడంతో కేంద్రాల వద్ద హడావుడి నెలకున్నది. ఒత్తిడికి లోను కావొద్దని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని తల్లిదండ్రులు సూచించారు. 


పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఐఈవో..

జిల్లాలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలను జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారి దస్రునాయక్‌ పరిశీలించారు. ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌, సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్‌, డీవోలకు పలు సూచనలు చేశారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సెంటర్లలో తప్పని సరిగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 


logo