సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Mar 04, 2020 , 23:27:22

గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి

గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ఆదిలాబాద్‌ రూరల్‌: గ్రామాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. మంగళవారం రాత్రి వాన్‌వట్‌లో పల్లెనిద్రచేసిన కలెక్టర్‌ బుధవారం ఉదయం 6గంటల నుంచి గ్రామంలో పర్యటించారు. పల్లెప్రగతిలో వాన్‌వట్‌లో చేపట్టిన పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు తడి,పొడి చెత్తలను వేరు చేసి డంపింగ్‌ యార్డుల్లో వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లోనూ ఇంకుడుగుంతలు నిర్మించుకొని, భూగర్భ జల మట్టం పెరిగేలా చూడాలన్నారు. వ్యవసాయం, పశుసంపద ద్వారా  ఆదాయ వృద్ధిని సాధించాలని సూచించారు. వెదురు బుట్టలను తయారు చేసి వాటిని మార్కెటింగ్‌ చేసేలా చూడాలని కోరారు. జిల్లాలో 44 శాతం అటవీవిస్తీర్ణం ఉన్నప్పటికీ వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో పాటు రెండు పంటలు పండించుకునే స్థితి లేకపోవడంతో రైతులు మరింత ఆదాయం సంపాధించలేకపోతున్నారన్నారు. 


మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అవసరమైతే మళ్లీ రుణాలు తీసుకోవాలన్నారు. మేదరి కులానికి చెందిన పార్వతి రుణం మంజూరు చేయించాలని కోరగా వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని వీవో గ్రూప్‌ నుంచి రుణం ఇప్పించాలని ఆదేశించారు. నర్సరీలో పెంచిన మొక్కలను గ్రామంలో నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. ఉదయం పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పాఠశాలల్లో సమస్యలు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి రాజేశ్వర్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ మో హన్‌సింగ్‌, ఎంపీడీవో రాథోడ్‌ రవీందర్‌, రూరల్‌ సీఐ పురుషోత్తం, ఎస్సై హరిబాబు, సర్పంచ్‌ కొడప తూర్పాబాయి, ఈవోపీఆర్డీ ఆనంద్‌, ఏఈ సతీశ్‌, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.logo