గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Mar 03, 2020 , 23:33:02

నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్‌కు నో

నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్‌కు నో
  • నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారుల సూచన
  • హాజరుకానున్న 19,991 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31 పరీక్షా కేంద్రాల్లో 19,991 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 

- ఆదిలాబాద్‌ రూరల్‌ విలేకరి


ఆదిలాబాద్‌ రూరల్‌ : జిల్లాలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎస్‌, డీవోలు ఇప్పటికే చూసుకున్నా రు. జిల్లా నుంచి ఈ ఏడాది పరీక్షలకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 10,880 మంది, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరంలో 1,125 మంది, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 7,681, ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరంలో 805, మొత్తం  19,991మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ ఏడాది కూడా ఇంటర్‌ విద్యార్థులకు ఒక్క నిమిషం గండం పొంచి ఉంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 


విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు బుధవారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల, ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలుర కళాశాలలను ఇంటర్‌ విద్యాధికారి దస్రు నాయక్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. 


గట్టిబందోబస్తు.. 

ఇంటర్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది ప్రశ్నాపత్రం లీకయిన నేపథ్యంలో ఈఏడాది రాష్ట్ర స్థాయి అధికారులు కూడా జిల్లాపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు మొబైల్‌ పార్టీలు సైతం పరీక్ష కేంద్రాల వద్ద మొహరించనున్నారు.


పరీక్షలు ఇలా..

ఇంటర్‌ ప్రథమ విద్యార్థులకు బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 6న ఇంగ్లిశ్‌ పేపర్‌ -1, 10న గణితం, బాటనీ, సివిక్స్‌, సైకాలజీ పేపర్‌ -1, 12న గణితం పేపర్‌ 1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌ -1, 14న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, క్లాసిక్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 17న కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌ -1 ఉంటాయి. 

ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మార్చి 5న సెకండ్‌లాంగ్వేజ్‌ పేపర్‌-2, 7న ఇంగ్లిష్‌ పేపర్‌-2, 11న గణితం, బాటనీ, సివిక్స్‌, సైకాలజీ పేపర్‌-2, 13న గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్‌-2, 16న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, క్లాసికల్‌ లాంగ్వేజెస్‌ పేపర్‌ -2, 18న కెమిస్త్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.


logo