శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Mar 02, 2020 , 23:21:18

మొన్నటిదాకా 5.. నేడు 10 కందిరైతు దగా!

మొన్నటిదాకా 5.. నేడు 10 కందిరైతు దగా!

తాంసి: తెలంగాణ ప్రభుత్వం కందుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే మధ్యవర్తులు.. దళారులు.. చివరకు కూలీలు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో కూలీలు కూడా రైతులను దోచుకుంటున్నారు.  ఒక్కో బ్యాగుకు రూ.5 వరకు తీసుకోవాలని నిబంధనలుంటే అందుకు భిన్నంగా రూ.10 తీసుకుంటున్నారు. ఇక్కడ కందుల కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇదీ అసలు విషయం...

మార్కెట్‌లో రైతులు కందులు అమ్మడానికి వచ్చినప్పుడు వాటిని యార్డులో మొత్తం కింద పోస్తుంటారు. సంబంధిత మార్క్‌ఫెడ్‌ అధికారులు కందులను చూసి ధరను నిర్ణయిస్తారు. అనంతరం వాటిని గన్నీ బ్యాగుల్లో నింపి కుట్టు వేస్తారు. ఒక్కో బ్యాగులో 50 కిలోలు కందులు నింపుతారు. ఈ బ్యాగులను కుట్టే కూలీలు మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా రైతుల నుంచి కూలి డబ్బులు వసూలు చేస్తున్నారు. శనివారం వరకు 50 కిలోల బస్తాకు రూ.5 ఉంటే సోమవారం రూ.10 వసూలు చేశారు. రైతులు ఈ విషయంపై నిలదీసినా ప్రయోజనం కనిపించడంలేదు. కూలీలు బలవంతగా రైతులనుంచి ఒక్కో బ్యాగుకు రూ.10 వసూలు చేశారు. ఉదాహారణకు ఒక రైతు 25 క్వింటాళ్ల కందులు మార్కెట్‌కు తెస్తే ఆరైతు శనివారం వరకు కూలీలకు రూ.250 చెల్లించేవారు... కానీ సోమవారం 25 క్వింటాళ్ల కందులు తెచ్చిన రైతు రూ.500 చెల్లించాల్సి వచ్చింది.

తెల్లకాగితంపై బ్యాగుల వివరాలు...

కందులను కాంటా చేసిన కూలీలు రైతులకు వారి బ్యాగుల వివరాలను తెల్లకాగితంపై రాసిస్తున్నారు. కానీ అందులో ఒక్కో బ్యాగుకు ఎంత కూలీ తీసుకుంటున్నారో ఆ వివరాలను రాసివ్వడం లేదు. ఇదేమిటని ప్రశ్నించినా కేవలం బ్యాగుల వివరాలు మాత్రమే రాస్తాం.. డబ్బులు రాయం అని తెగేసి చెబుతుండడం గమనార్హం. బలవంతంగా సోమవారం రైతుల నుంచి రూ.10 ఒక్కో బ్యాగుకు వసూలు చేశారు. ఈ విషయంపై ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శిని వివరణ కోరగా రైతుల నుంచి కులీలు ఒక్కో బ్యాగుకు రూ.5 మాత్రమే తీసుకోవాలని అన్నారు. రూ.10 తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మార్కెట్‌ అధికారులకు తెలిసినా..!

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో రైతులు ఇంతగా అధికారుల కళ్లముందే  దగాపడుతున్నా... ఈ విషయం పట్టించుకోవడంలేదు. తమకు తెలియదని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్‌లో కూలీలు ఇలా బహిరంగంగా రైతులనుంచి డబుల్‌ కూలీ దోచుకుంటున్నా.. తమకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని, డబుల్‌ కూలీ వసూలు చేసిన వారి నుంచి తిరిగి డబ్బులు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


logo