శనివారం 28 మార్చి 2020
Adilabad - Mar 01, 2020 , 23:27:08

పకడ్బందీగా పది పరీక్షలు

పకడ్బందీగా పది పరీక్షలు

ఆదిలాబాద్‌ రూరల్‌ :జిల్లాలో ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి అన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో కూడా ఎలాంటి కాపీయింగ్‌ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పారు. ఎస్సెస్సీ పరీక్షల్లో గత ఏడాది 95.77శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ ఏడాది వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. పది పరీక్షల ఏర్పాట్లపై డీఈవోతో ‘నమస్తే తెలంగాణ’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలు ఇవీ.. 

నమస్తే తెలంగాణ : జిల్లాలో పది విద్యార్థులకు ఎప్పటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు..?

జిల్లా విద్యాశాఖ అధికారి : పదో తరగతి పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ ఒకటిన చివరి పరీక్ష నిర్వహిస్తాం. అందుకు అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. 

జిల్లా నుంచి ఎంత మంది విద్యార్థులు 

ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరువుతున్నారు.?

జిల్లా నుంచి ఈ ఏడాది రెగ్యులర్‌గా 5,097 మంది బాలురు, 5,282మంది బాలికలు, ప్రైవేట్‌గా 439 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

మొత్తం ఎన్ని పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు..?

జిల్లావ్యాప్తంగా మొత్తం 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 48 పరీక్ష కేంద్రాలు, ప్రైవేట్‌ విద్యార్థుల కోసం మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. 

పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు..?

పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను ఆదేశించాము. పరీక్ష కేంద్రాల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే పక్కనే ఉన్న పాఠశాలల నుంచి ఫర్నిచర్‌ను సమకూరుస్తాం. తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించాం.

కాపీయింగ్‌ నిరోధానికి

 ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పది పరీక్షల్లో కాపీయింగ్‌ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. సీఎస్‌, డీవోలకు ఇప్పటికే సమావేశం నిర్వహించాం. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌ జరకుండా చూడాలని, చూస్తే వారే బాధ్యులని హెచ్చరించాం. అలాగే నాలుగు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తాయి. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. 

ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయా..?

ప్రశ్నపత్రాలు రెండు మూడు రోజుల్లో జిల్లాకు రానున్నాయి. వాటిని ఆయా పరీక్ష కేంద్రాలకు దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్లలో భద్రపరుస్తాం. అక్కడి నుంచి పరీక్ష రోజు ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను సీఎస్‌, డీవోలు, కస్టోడియన్‌లు తీసుకువెళ్తారు.

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా సతాయిస్తారనే ఆరోపణలు ఉన్నాయి కదా..?

ఇప్పటికే ప్రైవేట్‌ పాఠశాలలన్నింటికీ సమాచారం అందించాం. ప్రతి విద్యార్థికీ హాల్‌టికెట్‌ ఇవ్వాలని, ఎక్కడైనా ఇబ్బందులు పెడితే వెంటనే ఎంఈవో, డీఈ వో కార్యాలయంలో సంప్రదిస్తే హాల్‌టికెట్లు ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం. ఆన్‌లైన్‌ నుంచి తీసుకున్న హాల్‌టికెట్లను పరీక్ష కేంద్రాల్లో అనుమతించేలా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి 

భద్రత చర్యలు తీసుకుంటున్నారు..? 

పది పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ప్రతి కేంద్రం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను ఉంచాలని ఎస్పీని కోరాం. అలాగే పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించాం.

పరీక్షల నిర్వహణకు

 ఎంత మంది సిబ్బందిని నియమించారు..?

జిల్లాలోని 51 పరీక్షా కేంద్రాలకు 51మంది సీఎస్‌లు, 51మంది డీవోలతో పాటు సీ సెంటర్లకు కస్టోడియన్లను నియమిస్తున్నాం. వీరితో పాటు సెంటర్‌కు 12మంది ఇన్విజిలేటర్ల చొప్పున 612 మంది ఇన్విజిలేటర్లను నియమించడానికి ఆదేశించాము. 

కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తారా..?

జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులున్నా కంట్రోల్‌ రూమ్‌లోని 08732 - 226434కు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చు.


logo