సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Mar 01, 2020 , 23:22:33

అడెల్లి రోడ్డుతో సంబంధాలు మెరుగు

అడెల్లి రోడ్డుతో సంబంధాలు మెరుగు

బోథ్‌, నమస్తే తెలంగాణ : అడెల్లి రోడ్డు నిర్మాణం పూర్తయితే సంబంధాలు మెరుగుపడతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, కలెక్టర్‌ శ్రీదేవసేనతో కలిసి రోడ్డు నిర్మాణ పనులకు రఘునాథ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దశాబ్దాల కాలంగా బోథ్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని భక్తులు అడెల్లి రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రోడ్డు పూర్తయితే సుమారు 40 కిలోమీటర్ల మేర దూర భారం తగ్గుతుందన్నారు. ప్రసిద్ధ అడెల్లి పోచమ్మ దర్శనంతో పాటు నిర్మల్‌, సారంగపూర్‌ ఇతర ప్రాంతాలకు రవాణా సంబంధాలు మెరుగవుతాయన్నారు. రోడ్డు నిర్మాణం కోసం రూ. 4.65 కోట్ల నాబార్డు (ఆర్‌ఐడీఎఫ్‌-20) నిధులు మంజూరైనట్లు చెప్పారు. అటవీ ప్రాంతానికి బదులుగా భూమి కోల్పోతున్న, మొక్కలు, చెట్ల పెంపకానికి మరో రూ.2.65 కోట్లు అటవీ శాఖకు త్వరలోనే రోడ్లు, భవనాల శాఖ మంజూరు చేస్తుందన్నారు. అటవీ ప్రాంతాల గుండా రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున అడవులను రక్షించే బాధ్యత సమీప గ్రామాలపై ఉంటుందన్నారు. చెట్లు నరికితే రాబోయే తరాలకు ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అడవిలోని చెట్లను రక్షించడంతో పాటు నాటిన ప్రతీ మొక్క బతికేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్‌ శ్రీదేవసేన మాట్లాడుతూ... ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. గ్రామాల్లో కట్టుకున్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. మరుగుదొడ్డి లేని వారికి కొత్తగా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నెత్తి మీద బిందె పెట్టుకొని నీటి కోసం మహిళలు వెళ్లవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకం తీసుకువచ్చారన్నారు. నెత్తి మీద బిందెతో పాటు చేతిలో చెంబు కనబడవద్దన్నారు. పల్లె ప్రగతిని కొనసాగిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవారికి.. అడెల్లి రోడ్డు వంటి పనులు చూస్తే తెలుస్తుందన్నారు. గత సీమాంధ్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపితే రూ.లక్షలు కూడా మంజూరు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతీ ఏటా బోథ్‌ నియోజకవర్గానికే రూ.కోట్లాది నిధులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, జడ్పీటీసీలు డాక్టర్‌ సంధ్యారాణి, జాదవ్‌ అనిల్‌, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌బిన్‌ సలాం, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రుక్మణ్‌సింగ్‌, సర్పంచ్‌ ఆడె చాంగుబాయి, ఎంపీటీసీ మడావి అమరావతి, టీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నిర్మల్‌ జిల్లా నాయకులు రాంకిషన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, లోలం శ్యాంసుందర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస్‌రావు, డీఈఈ సురేశ్‌, ఏఈ అరవింద్‌, అటవీ రేంజ్‌ అధికారి సత్యనారాయణ, బోథ్‌ సీఐ రవీందర్‌, వివిధ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo