సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 28, 2020 , 23:15:07

ఎన్నిక నేడే..!

ఎన్నిక నేడే..!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సహకార ఎన్నికల్లో చివరి ఘట్టానికి తెరలేచింది. పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పీఏసీఎస్‌ ఎన్నికల్లో డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ దక్కించుకున్నది. ఈనెల 25న నిర్వహించిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల పదవుల ఎన్నికల్లోనూ గులాబీ పార్టీదే గుత్తాధిపత్యం కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 20డీసీసీబీ డైరెక్టర్లు, 10డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులకుగాను.. 17డీసీసీబీ, 10డీసీఎంఎస్‌ పోస్టులను ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఎస్సీ కోటాలో రెండు, బీసీ కోటా ఒక డైరెక్టర్‌ పోస్టుకు అభ్యర్థులు లేకపోవడంతో వాయిదా పడ్డాయి. దీంతో మొత్తం 27 డైరెక్టర్‌ పోస్టులు ఏకగ్రీవంకాగా.. అన్ని ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ మద్దతు దారులకే దక్కాయి. 


డీసీసీబీ కార్యాలయంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నేడు నామినేషన్లు స్వీకరించిన అ నంతరం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్‌, బీజే పీ నుంచి ఒక్క డైరెక్టరు కూడా లేకపోవడంతో ఆ పార్టీల నుంచి నామినేషన్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో టీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కొక్కరే నామినేషన్లు వేయనుండగా.. ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పూర్తి మెజార్టీ ఉండడంతో ఈ నాలుగు పదవులు గులాబీ ఖాతాలో పడనున్నాయి. మద్దతుదారులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను ఏకపక్షంగా, ఏకగ్రీవంగా దక్కించుకోనున్నారు. ఆదిలాబాద్‌లోని డీసీసీబీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 25న డైరెక్టర్లు క్యాంపులోకి వెళ్లగా.. వారంతా నేడు నేరుగా డీసీసీబీ కార్యాలయానికి రానున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొని చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఎవరనే విషయంపై రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీతో చర్చించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో పేర్ల జాబితాను అధినాయకత్వానికి పంపించారు. 


నేడు జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు అభ్యర్థులు ఎవరనేది ఇప్పటికే స్ప ష్టత రాగా అధిష్ఠానమే అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే డైరెక్టర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేయగా.. అభ్యర్థులెవరనేది అధిష్ఠానం శనివారం ప్రకటించనున్న ది. ఈ మేరకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులకు అధిష్ఠానం నుంచి సమాచారం రానుంది. ఇప్పటికే మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో పేర్లను పంపగా.. అధికారికంగా మాత్రం రాష్ట్ర నాయకత్వమే వెలువరించనుంది. ఉమ్మడి జిల్లా ఆధారంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఉండగా.. జిల్లా స్థాయి పదవుల్లో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యత దక్కేలా చూస్తున్నారు. రెండు చైర్మన్లు, రెండు వైస్‌ చైర్మన్‌ పదవులు ఉండగా.. నాలుగు పదవులను నాలుగు జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చి అందరికీ న్యాయం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తవగా.. నేడు అధికారికంగా అభ్యర్థుల ప్రకటన, ఎన్నిక, ఫలితాల వెల్లడి చేయనున్నారు. 


logo