బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 28, 2020 , 23:11:55

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతం అవుతుందని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఖానాపూర్‌ కాలనీలో పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయొద్దని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్‌ కార్మికులకు అందజేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన చేయొద్దని పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలించే బాధ్యతను మెప్మా సిబ్బందికి అప్పగిస్తామన్నారు. ప్రతి 20 ఇండ్లకు ఒక మహిళా సభ్యురాలిని నియమించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలను పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. పరిశుభ్రంగా ఉంచితేనే ఆ నిధులు వినియోగించవచ్చన్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.30లక్షల నిధులు కేటాయిస్తున్నదని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పట్టణం పరిశుభ్రంగా మారే వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ విజయ్‌, ప్రత్యేక అధికారి శంకర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజు, సిబ్బంది ఉన్నారు. 


మున్సిపల్‌ కార్మికులకు సన్మానం.. 

పట్టణంలోని ఖానాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో  మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్‌ శ్రీదేవసేన పుష్పగుచ్ఛాలను అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కలెక్టర్‌ సన్మానించిన వారిలో చిన్నయ్య, లక్ష్మి, దేవమ్మ తదితరులు ఉన్నారు. 


అసిస్టెంట్‌ కలెక్టర్‌, ప్రజాప్రతినిధుల పర్యటన..

పట్టణంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ దేవసేన, స్థానిక సంస్థల అసిస్టెంట్‌ కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పరిశీలించారు. 30వార్డు ఖానాపూర్‌, అంబేద్కర్‌నగర్‌ కాలనీలో కలెక్టర్‌ పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని హరితహారంలో భాగంగా నాటిన మొక్కకు నీరు పోశారు. పరిశుభ్రత పచ్చదనంపై ప్రజలకు వివరించారు. స్థానిక సస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్ని వార్డుల్లో పర్యటించారు. పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వార్డు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పట్టణ ప్రణాళిక పై అధికారులు, కౌన్సిలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ శాంతినగర్‌ కాలనీతో పాటు పలు వార్డుల్లో  పర్యటించి పనులను పరిశీలించారు. వైస్‌ చైర్మన్‌ జహిర్‌రంజాని ఖానాపూర్‌ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


logo