సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 28, 2020 , 23:08:49

రెండో పంటను సాగుచేసుకోవాలి

రెండో పంటను సాగుచేసుకోవాలి

ఇచ్చోడ : ఇక్కడి పంటచేల్లు, నల్ల రేగడి భూములు.. పంటల దిగుబడులు చాలా బాగానే వస్తాయి.. గిరిజన రైతులు రెండో పంటను సాగు చేయాలి.. అద్భుత ఫలితాలను సాధించాలి.. రెండో పంట గిరిజనులకు ఊపిరి ఇవ్వాలి.. దీనిపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. ఉపాధి హామీ పథకం కింద గిరిజనుల భూములను అభివృద్ధి పర్చాలనీ, గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనీ సూచించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మాన్కపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మేడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం అర్ధరాత్రి 12.20 నిమిషాలకు చేరుకుని నిద్రించారు. శుక్రవారం ఉదయం మేడిగూడతోపాటు మాన్కపూర్‌ గ్రామాలను అధికారులతో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో చేపట్టిన డంపింగ్‌ యార్డు, హరితహారం నర్సరీలో ప్రాథమిక నారుమళ్లు, హరితహారంలో నాటిన మొక్కలు, ఇంకుడు గుంతలు, సేంద్రియ ఎరువుల కంపోస్ట్‌ షెడ్డు పనులను పరిశీలించారు. 

ఇంటింటికీ తిరుగుతూ..

ఉదయం పూట కలెక్టర్‌ మేడిగూడలో ఇంటింటికి తిరుగుతూ గిరిజన మహిళలతో స్వయంగా మాట్లాడారు. నీ పేరేందమ్మా అంటూ.. ఆప్యాయంగా పలకరించారు. మరుగుదొడ్డి కట్టుకున్నావా..? కట్టుకోలేని వారిని ఎందుకు కట్టుకోలేదమ్మా...? కారణం ఏమిటీ అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ముహూర్తం అంటూ ఏమీ చూడకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగాలనీ, ఈ నీరు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని చెప్పారు. 


ప్రతిపాదనలు పంపండి

మేడిగూడలోని రాయిసెంటర్‌ సమావేశ భ వనాన్ని, పాఠశాల, ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు. చుట్టూ ప్రహరీ నిర్మాణాలు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని గిరిజనులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్‌ ఏఈతో ప్రతిపాదనలు తయారు చేసి పం పాలని కలెక్టర్‌ సూచించారు. నిధులను మంజూరు చేస్తానని వారికి భరోసా ఇచ్చా రు. అనంతరం గ్రామంలో నాటిన హరితహారం మొక్కలకు నీరు పోశారు. ప్రతి శుక్రవారం గ్రీన్‌ డే సందర్భంగా మొక్కలకు నీరు పోయాలనీ, వాటి సంరక్షణ బాధ్యత అందరిపైనా ఉందనీ అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మడావి సులోచన, జడ్పీటీసీ కదం సుభద్రబాయి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌ ధమ్మారెడ్డి, మేడిగూడ పీఏసీఎస్‌ చైర్మన్‌ కుమ్రం కోటేశ్వర్‌, డీఆర్‌డీఏ పీడీ రాథోడ్‌ రాజేశ్వర్‌, స్థానిక ఎంపీడీవో వామన్‌భట్ల రాంప్రసాద్‌, తహసీల్థార్‌ ముహ్మాద్‌ అతీకొద్దీన్‌, ఎంపీవో రమేశ్‌, ఈజీఎస్‌ ఏపీవో నరేందర్‌గౌడ్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో సౌందర్య, ఐకేపీ ఏపీఎం దయాకర్‌, ట్రాన్స్‌ కో ఏఈ రవి, మండల విద్యాధికారి రాథోడ్‌ ఉదయ్‌రావ్‌ పాల్గొన్నారు. 


logo