శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 23:48:39

మూడో రోజూ ఉత్సాహంగా..

మూడో రోజూ ఉత్సాహంగా..

ఆదిలాబాద్‌,నమస్తే తెలంగాణ ప్రతినిధి:  మురికిమయంగా మారిన పట్టణాలను పరిశుభ్రంగా మార్చడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించడం, విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో జోరుగా సాగుతోంది. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా ఈ నెల 24న ఈ కార్యక్రమంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి వార్డులకు నియమించిన ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, స్థానికులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. పది రోజుల పాటు పట్టణప్రగతి  కొనసాగనుండగా షెడ్యూల్‌ ప్రకారం రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మూడోరోజు బుధవారం మురికి కాల్వలను శుభ్రం చేశారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుభ్రం చేసేలా చర్యలు చేపట్టారు. పట్టణంలోని పాత వార్డులతో కలిసి పునర్విభజనలో భాగంగా పరిసర ప్రాంతాలు మున్సిపాలిటీలో కలిశాయి. 49 వార్డుల్లో మురికికాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోగా.. తాగునీటి పైపులకు లీకేజీలు, అపరిశుభ్రత కారణంగా పలు వార్డుల్లో దుర్వాసన వస్తున్నది. పట్టణప్రగతితో వార్డులు కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. 

ప్రజల భాగస్వామ్యం..

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములవుతున్నారు. పలు వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశుభ్రత, పచ్చదనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. రోజు ఉదయం వార్డులో చేపడుతున్న కార్యక్రమాలకు హాజరవుతూ షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు చేపట్టే పనుల్లో భాగస్వాములవుతున్నారు. మురికిగా మారిన వార్డుల్లో పరిశుభ్రత నెలుకునేలా అధికారులు, కౌన్సిలర్‌లతో కలిసి కృషి చేస్తున్నారు. కలెక్టర్‌ శ్రీదేవసేన క్రాంతినగర్‌లో, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ శాంతినగర్‌, క్రాంతినగర్‌, తిలక్‌నగర్‌, భాగ్యనగర్‌ పర్యటించి పనులను పరిశీలించారు. పరిశుభ్రత, పచ్చదనం ఇతర విషయాలపై వారికి అవగాహన కల్పించారు.

ప్రజల సహకారం అవసరం: కలెక్టర్‌ 

ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. క్రాంతినగర్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆమె హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వార్డులో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటి, వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. స్థానికులు వార్డుల పరిశుభ్రత కోసం తమ సహకరాన్ని అందించాలని కోరారు. చెత్తను రోడ్లపై పడేయకుండా మున్సిపాలిటీ రిక్షాల్లో వేయాలని కోరారు. పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అక్కడ జరుగున్న పనులను పరిశీలించారు. ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్‌లు, స్థానికులతో కలిసి వార్డుల్లో పర్యటించారు. కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.  క్రాంతినగర్‌ శ్మశాన వాటికలోని డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను క్రేన్‌తో తొలగించారు. పది రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించిన వార్డులను పరిశుభ్రంగా తయారు చేయాలని కోరారు. 


logo