బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 23:45:43

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

‘నమస్తే’: ఇంటర్‌ పరీక్షలు ఎప్పటి నుంచి..? 

డీఐఈవో: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మార్చి 4 నుంచి 18వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశాం. అసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.


ఈ ఏడాది ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు?

ఈ ఏడాది రెగ్యులర్‌గా ప్రథమ సంవత్సరంలో 11,505 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,486 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.


జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు?

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 14, టీఎస్‌ సోషల్‌ వెల్ఫేర్‌ 2, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 5, మోడల్‌ స్కూల్‌1, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలక్‌ మందిర్‌ 1, 8 ప్రైవేట్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశాం.

గత ఏడాది పరీక్షల సందర్భంగా ఫర్నిచర్‌ సరిపోక విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాశారు.. 


ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్షలు రాయకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌, డీవోలకు ఆదేశాలిచ్చాం. అవసరమైతే విద్యాశాఖ సహాయంతో పాఠశాలల నుంచి ఫర్నిచర్‌ను తీసుకోవాలని సూచించాం.


మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం 3 ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు, 3 కస్టోడియన్‌ కం సిట్టింగ్‌ స్కాడ్‌లను అందుబాటులో ఉంచుతున్నాం. 


ఇంటర్‌ పరీక్షలకు నిమిషం గండం ఉందా.?

ఈ ఏడాది కూడా పరీక్షా కేంద్రాలకు 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించరు. విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.


కొన్ని ప్రైవేటు కళాశాలలు ఫీజుల విషయంలో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా సతాయిస్తాయి కదా..?

విద్యార్థులు హాల్‌టికెట్లకు భయపడాల్సిన పనిలేదు. అందరికీ తప్పని సరిగా హాల్‌టికెట్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించాం. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఆన్‌లైన్‌ నుంచి హాల్‌టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు.


పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు..?

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. ముఖ్యంగా ఎండలను దృష్టిలో ఉంచుకుని తప్పని సరిగా ప్రతి కేంద్రంలో మినరల్‌ వాటర్‌ను అందుబాటులో ఉంచాలని సూచించాం. ప్రథమ చికిత్స చేసేందుకు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచుతున్నాం. పరీక్షా కేంద్రాలకు,  సమయానికి బస్సులు నడపాలని ఆర్టీసీని కోరాం.

ప్రశ్నపత్రాలను ఎలా ఓపెన్‌చేయాలి..?

జిల్లాలో 13 స్టోరేజ్‌ పాయింట్లను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రంలోనూ తప్పని సరిగా సీసీ కెమెరాను అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలను ఓపెన్‌ చేయాలి. ప్రశ్నపత్రాలను తీసుకెళ్లే వాహానాలకు జియో ట్యాగింగ్‌ ఉంటుంది.


144 సెక్షన్‌ అమలులో ఉంటుందా?

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పరీక్ష నిర్వహించే సమయాల్లో జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించాం. ప్రతీ కేంద్రం పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 


కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నారా?

జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులుంటే వెంటనే కంట్రోల్‌ రూం. నెంబర్‌ 08732 - 297115, సెల్‌నెంబర్‌ 98487 81808కు సమాచారం అందించవచ్చు. 


logo