శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 00:19:08

సహకారం.. ఏకపక్షమే!

సహకారం.. ఏకపక్షమే!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వరుస ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుండగా. తాజాగా సహకార ఎన్నికల్లోనూ గులాబీదే గుత్తాధిపత్యం కొనసాగుతున్నది.ఇటీవల జరిగిన పీఏసీఎస్‌ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో కారు దూసుకుపోగా.. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పూర్తి ఆధిపత్యం సాధించారు. పీఏసీఎస్‌ ఎన్నికల్లో 95శాతానికిపైగా డైరెక్టర్‌ పదవులను దక్కించుకోగా.. 77 పీఏసీఎస్‌లకుగాను 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు. తాజాగా మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లాలో 20 డీసీసీబీ డైరెక్టర్లకు, పది డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరించగా 18 డీసీసీబీ డైరెక్టర్‌ పదవులకు, 10 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు సింగిల్‌ నామినేషన్లు వచ్చాయి. మరో రెండు డైరెక్టర్‌ పదవులకు ఒక్క నామినేషన్‌ కూడా రాలేదు. ఎస్సీ కోటాలోని రెండు డైరెక్టర్‌ పదవులకు.. సంబంధిత రిజర్వేషన్‌ అభ్యర్థులు లేకపోవడంతో వీటిని వాయిదా వేశారు. 18 డీసీసీబీ, 10 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే నామినేషన్‌ వేయగా.. అవి రిజర్వేషన్ల ప్రకారం సంఖ్యకు అనుగుణంగా నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన డీసీసీబీ, డీసీఎంఎస్‌ సంబంధించి 28 డైరెక్టర్‌ పోస్టులను టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు ఏకపక్షంగా, ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 

గంపగుత్తగా గులాబీ పార్టీకే..

పీఏసీఎస్‌లలో చైర్మన్లుగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఇద్దరు, బీజేపీ మద్దతుదారులు ముగ్గురు గెలువగా.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులకు మెజార్టీ అసలే లేకుండాపోయింది. దీంతో తాజాగా కాంగ్రెస్‌, బీజేపీల నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులకు నామినేషన్లు వేయలేదు. 28 డైరెక్టర్‌ పోస్టులకు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే నామినేషన్లు దాఖలు చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులను ఏకపక్షంగా, ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకోవడంతో ఈ నెల 29న జరిగే డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే దక్కించుకోనున్నారు. ఈ నెల 28న డీసీసీబీ డైరెక్టర్ల కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రిజర్వేషన్ల సంఖ్య ప్రకారమే నామినేషన్లు రావడంతో 28 డైరెక్టర్‌ పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 28న డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నిక లేకుండా పోయింది. ఈ నెల 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవులకు ఈ నెల 29న నామినేషన్లు స్వీకరించి ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే మెజార్టీ ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి డైరెక్టర్లు లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే పదవులను ఏకపక్షంగా, ఏకగ్రీవంగా దక్కించుకోనున్నారు. ఈ లెక్కన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు గంపగుత్తగా గులాబీ ఖాతాలో పడినట్లే. 

అభ్యర్థుల ఎంపికపై అల్లోల దృష్టి

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి అభ్యర్థులు ఎవరనే విషయంపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మిగతా 9 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లతో పాటు ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో మంత్రి అల్లోల సమావేశమై చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల విషయమై చర్చిస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను ఎవరికి ఇస్తే బాగుంటుందని అనే విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందరి అభిప్రాయాన్ని సేకరించి.. మెజార్టీ సభ్యుల మద్దతు మేరకే పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయంతోనే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తవగా.. తుది పేర్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. జిల్లా నుంచి పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపాక.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎవరనేది సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ మేరకు ఈ నెల 29లోపు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఎవరనేది అధిష్టానం పేర్లను ప్రకటించనుంది. ఆ ప్రకారమే ఈనెల 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఈ ఎన్నికలు కూడా ఏకగ్రీవం కానున్నాయి. 


logo