ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 26, 2020 , 00:11:21

పట్టణాభివృద్ధికి బాటలు వేద్దాం

పట్టణాభివృద్ధికి బాటలు వేద్దాం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతితో అభివృద్ధికి బాటలు వేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా గుర్తించిన సమస్యలను తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పల్లె ప్రణాళిక కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. వార్డుల్లో ఇప్పటివరకు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఖాలీ స్థలాల్లో చెత్త, పిచ్చిమొక్కలను తొలగించడానికి యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలను తొలగించాలని సూచించారు. రోజూ మురికి కాల్వల్లో పూడిక తీయించి బ్లీచింగ్‌ పౌండర్‌ వేయించాలని సూచించారు. కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు వార్డుల్లో ఏండ్ల తరబడి సమస్యలు పరిష్కారం కావడంలేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయని తెలిపారు. 31వార్డుకు సమీపంలో స్లాటర్‌ హౌస్‌తో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందని, వెంటనే దానిని వేరేచోట ఏర్పాటు చేయించాలని సూచించారు. పట్టణంలో మిషన్‌ భగీరథ పనులు నత్తనడకణ కొనసాగుతున్నాయని, త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలన్నారు. ప్రత్యేక అధికారులు వార్డుల వారీగా సమస్యలను గుర్తించి ప్రగతి కోసం ప్రణాళికలను తయారు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఎమైనా ఇబ్బందులుంటే వెంటనే తనకు తెలిజేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజు, ప్రత్యేక అధికారులు జడ్పీ సీఈవో కిషన్‌, డీఆర్డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo