మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 24, 2020 , 00:04:28

గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి

గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి

ఆదిలాబాద్‌/ నమస్తేతెలంగాణ ప్రతినిధి : సమష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని రెండుసార్లు నిర్వహించామన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యలను పూర్తిచేసేందుకు ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలని, గ్రామాల ప్రగతి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. గ్రామాలు ప్రగతిబాటలో పయణించేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగాలని, కనీస వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత రోడ్లు, మురికికాల్వల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


గ్రామాల్లో పచ్చదనం నెలకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన స్థలాల్లో నర్సరీల పెంపకం చేపట్టి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రభుత్వం ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, ఎమ్మెల్సీ పురాణ సతీశ్‌, కలెక్టర్‌ శ్రీదేవసేన, అడిషనల్‌ కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>