శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Feb 23, 2020 , 03:46:34

అడవిలో అగ్ని ప్రమాదాలకు చెక్‌!

అడవిలో అగ్ని ప్రమాదాలకు చెక్‌!

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: వేసవి కాలంలో అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు  అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంత సమీప గ్రామాలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నారు. అడవి దారి నుంచి వచ్చి వెళ్లే బాటసారులకు అగ్గి పెట్టెలు, బీడీలు, సిగరెట్లకు అనుమతి నిరాకరిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను ఆర్పడానికి డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఫైర్‌ బ్లోయర్లు అవసరమైన సామగ్రిని సమకూర్చారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ఇచ్చి సిద్ధం చేశారు. 


ముందస్తు చర్యలు..

అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. చేలలో రైతులు పత్తి కట్టే కాలబెట్టడం, అడవుల్లో నుంచి దారిగుండా వచ్చి వెళ్లే బాటసారులు బీడీ, సిగరేటు కాల్చి పారేయడం,  అడవుల్లో నిర్వహించే జాతరలో వంటలు చేసుకొని అగ్గిని ఆర్పకుండా వెళ్లడం వంటి వాటితో గతంలో అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు తెలుసుకున్నారు. కాగా ఇలాంటి ప్రమాదాలు  పునరావృతం కాకుండా అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు, రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అడవుల్లో దారిపొడవునా వాచర్లను ఏర్పాటు చేశారు. షిప్టుల వారీగా విధులు కేటాయించారు. అడవుల గుండా వచ్చి వెళ్లే వారిని తనిఖీ చేస్తున్నారు. వారివద్ద అగ్గిపెట్టెలు, లైటర్లు, బీడీలు సిగరెట్లు ఉంటే వాటిని తీసుకుంటున్నారు. 


సిబ్బందికి శిక్షణ..

ఆదిలాబాద్‌ జిల్లాలో 2.5 లక్షల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. కాగా..తరుచూ అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాల ప్రదేశాలను  ఫైర్‌లైన్లుగా గుర్తించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే 50 మందికి పైగా అటవీ శాఖ సిబ్బందికి ఫైర్‌ బ్లోయర్‌ వినియోగం,  ధరించే దుస్తువులపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ప్రమాదవశాత్తు అడవుల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే సాటిలైట్‌ ద్వారా తెలుసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌కు ప్రమాదం జరిగిన లోకేషన్‌ సమాచారం వస్తుంది. వెంటనే కంట్రోల్‌ రూం ఆపరేటర్‌ సంబంధిత అధికారులకు సమాచారం అందజేస్తారు. హుటాహుటిన సిబ్బంది ఘటనా స్థలాలకు వెళ్లి మంటలను అదులోకి తీసుకువస్తున్నారు. శాస్త్రీయంగా అడవులను రక్షించడానికి అధికారులు  ఫైర్‌ బ్లోయర్లు, ఇతర సామగ్రితో పాటు ప్రత్యేక వాహనం,  డివిజన్లగా వారీగా ప్రత్యేక సిబ్బందిని 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నారు.  


logo