గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 23, 2020 , 03:41:35

54 శాతం లక్ష్యం పూర్తి

54 శాతం లక్ష్యం పూర్తి
  • ఇప్పటి వరకు రూ. 11.24లక్షల ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూలు
  • వసూళ్లను ముమ్మరం చేసిన అధికారులు
  • ఆర్థిక సంవత్సరానికి సమీపిస్తున్న గడువు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  మున్సిపాలిటీకి ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 20.44లక్షలు లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు రూ. 11.24లక్షలు వసూలు కాగా..54శాతానికి చేరుకుంది. ఇంకా రూ. 9.20లక్షలు వసూలు కావాల్సి ఉంది. వచ్చే నెల 31తో గడువు ముగియనుండగా, ట్రేడ్‌లైసెన్సుల ఫీజుల వసూళ్లను మున్సిపల్‌ అధికారులు ముమ్మరం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేశారు. లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోని వారి వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తున్నారు. గడువులోగా రెన్యూవల్‌ చేసుకోని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 


పెరిగిన ఆదాయం..

పట్టణాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమీప గ్రామాలను విలీనం చేసింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో మావల గ్రామ పంచాయతీ పరిధిలో రామ్‌నగర్‌, టీచర్స్‌ కాలనీ, సాయినగర్‌, దస్నాపూర్‌, దోబీ కాలనీ, పిట్టల్‌వాడ, కైలాశ్‌నగర్‌, సుభాష్‌నగర్‌తో పాటు బట్టి సావార్గాం పంచాయతీ పరిధిలోని టైలర్స్‌ కాలనీ, న్యూహౌజింగ్‌ బోర్డు కాలనీ, అనుకుంట, బెల్లూరి, రాంపూర్‌ గ్రామాలు సంపూర్ణంగా విలీనం అయ్యాయి. ఈ విలీన వార్డులు, గ్రామాల్లో 600 షాపులు ఉన్నట్లు గుర్తించారు.  పాత మున్సిపాలిటీ పరిధిలోని 2704 షాపులు ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 17.41లక్షలు టార్గెట్‌గా ఉన్నది.  పాతవి, కొత్తవి కలిపి మొత్తం 3304 షాపులకు ఈ ఏడాది లైసెన్సు ఫీజులు రూ. 20.44 లక్షలు టార్గెట్‌ను నిర్దేశించారు. గతంతో పోలిస్తే ట్రేడ్‌లైసెన్సుల ద్వారా మున్సిపాలిటీకి రూ. 3లక్షలకు పైగా ఆదాయం పెరిగింది. నూతనంగా మరిన్ని షాపులు ఏర్పాటు అయినట్లు సమాచారం. దీంతో మరింత పెరిగే అవకాశం ఉంది.


వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌..

మున్సిపాలిటీల్లో పన్నులు వంద శాతం జరిగితే స్థానికంగా పారిశుద్ధ్యం ఇతరాత్ర అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు పాలకవర్గం, అధికార యంత్రాంగం వివిధి పన్నుల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నది. ట్రేడ్‌ లైసెన్సుల ద్వారా ఈ ఏడాది రూ. 20.44లక్షలు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ.11.24లక్షలు వసూలు అయ్యాయి.  స్పెషల్‌ డ్రైవ్‌కు ప్రత్యేక బృందాన్ని  ఏర్పాటు చేసి లైసెన్సు ఫీజు చెల్లించని వ్యాపార సముదాయల వద్దకు వెళ్ల్లి నోటీసులు ఇస్తున్నారు. గడువులోగా పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించాలని కోరుతున్నారు. 


logo