శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 22, 2020 , 03:47:19

ఆశాజనకంగా శనగ పంట

ఆశాజనకంగా శనగ పంట

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి :  యాసంగి సీజల్‌లో రైతులు సాగుచేస్తున్న శనగ పంట ఆశాజనకంగా ఉంది. గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈసారి శనగ పంటను రైతులు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 32వేల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. ప్రస్తుతం సకాలంలో సబ్సిడీపై శనగ విత్తనాలను అందజేయడంతో పాటు వాతావరణం కూడా అనుకూలించడంతో రైతులు శనగ పంట సాగు చేయడానికి ఆసక్తిని చూపారు. ప్రస్తుతం పంట బాగుందని, దిగుబడులు కూడా అధికంగా వస్తాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. 


జిల్లాలో రైతులు ఎక్కువగా వానాకాలం పంటలు సాగుచేస్తారు. సాగునీటి సౌకర్యం తక్కువగా ఉండడంతో యాసంగి పంటలు తక్కువగా పండిస్తారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లాలో యాసంగి సాగు కూడా క్రమంగా పెరుగుతున్నది. జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 2.10 లక్షల హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలను సాగుచేయగా యాసంగిలో కూడా దాదాపు 40 వేల హెక్టారల్లో పంటలు సాగవుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి గతేడాది కంటే  రైతులు యాసంగిలో శనగ పంటను 32 వేల హెక్టార్లలో సాగుచేశారు. ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో 35 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ చేయడంతో సకాలంలో విత్తనాలు నాటారు. 


తెలంగాణ సీడ్స్‌ ద్వారా 1,200 క్వింటాళ్లు, నేషనల్‌ సీడ్‌ కార్పోరేషన్‌ ద్వారా 70 క్వింటాళ్లు, హాకా ద్వారా 6,500 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందజేశారు. 25 కిలోల శనగ విత్తనాల బస్తా ధర రూ.1,625 ఉండగా రూ.568.75 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుండగా రైతులు రూ.1056.25 చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా సబ్సిడీ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేశారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయగా పంటను సాగుచేసే రైతులకు మాత్రమే విత్తనాలు లభించాయి. వానాకాలంలో పత్తి, సోయాబిన్‌, కంది, పెసర పంటలను, యాసంగిలో శనగ, గోధుమ, జొన్న, పల్లి పంటను రైతులు సాగు చేస్తారు. రెండు సీజన్లలో అక్కడక్కడా కూరగాయల పంటలను కూడా పండిస్తారు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉండడంతో రైతులు శనగ పంటవైపే మొగ్గుచూపారు. వానాకాలంలో సోయాబిన్‌, పత్తి పంటలను సాగుచేసిన రైతులు రెండో పంటగా శనగను పండిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పత్తి, సోయాబిన్‌ పంటను తీసివేయగా శనగ పంటను వేశారు. ఇది ప్రస్తుతం కాత దశలో ఉంది. 


అధిక దిగుబడులపై ఆశలు.. 

జిల్లాలో ఈసారి శనగ పంట దిగుబడులు కూడా అధికంగా ఉంటాయని అధికారులు అంటున్నారు. గతేడాది వానాకాలం చివర్లో కురిసిన వర్షాలతో రైతులు ఎక్కువగా పంటను సాగుచేశారని, దీంతో దిగుబడులు సైతం అధికంగా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో రైతులు సాగుచేసిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. వానాకాలం సీజన్‌లో పండించిన పత్తి, సోయాబిన్‌ను ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలోని తొమ్మిది మార్కెట్‌యార్డుల్లో నాఫెడ్‌ ద్వారా కంది కొనుగోళ్లు జరుగుతున్నాయి. యాసంగిలో రైతులు పండించిన శనగ పంటను సైతం సేకరించిడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌  ద్వారా పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో శనగ రైతులకు మద్దతు ధర లభించనుంది. logo