బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Feb 22, 2020 , 00:35:29

కోచ్‌లు కావలెను..!

కోచ్‌లు కావలెను..!

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సుమారు 17 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ నిత్యం వందల సంఖ్యలో క్రీడాకారులు వి విధ రకాల క్రీడల్లో సాధన చేస్తుంటారు.

  • ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో శిక్షకుల కొరత
  • సొంతగా సాధన చేస్తున్న క్రీడాకారులు
  • స్పోర్ట్స్‌ స్కూల్‌లోనూ ఇదే పరిస్థితి
  • 160 మంది క్రీడాకారులకు ముగ్గురే కోచ్‌లు
  • స్థానికంగా భర్తీ చేసుకోవాలని
  • ఆదేశాలున్నా పట్టించుకునే వారు కరువు

ఆదిలాబాద్‌ రూరల్‌ : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సుమారు 17 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ నిత్యం వందల సంఖ్యలో క్రీడాకారులు వి విధ రకాల క్రీడల్లో సాధన చేస్తుంటారు. జిల్లాలో ఖోఖో, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, హాకీలో మంచి ప్రావీ ణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నా కానీ జిల్లా క్రీడామండలిలో కనీసం ఒక్క కోచ్‌ కూడా లేకపోవడంతో సరైన శిక్షణ లేక అరకొర ప్రాక్టీస్‌తోనే వివిధ ఆటల్లో రాణిస్తున్నారు. 


ప్రతిభ చూపుతున్న క్రీడాకారులు.. 

జిల్లాలో స్కూల్‌ గేమ్స్‌, క్రీడాసంఘాల నుంచి పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడక ముందు ఇదే స్టేడియంలో అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను కూడా జిల్లా క్రీడామండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. కానీ ఐదారేండ్లుగా స్టేడియంలో ఒక్క కోచ్‌ పోస్టును కూడా భర్తీ చేయక పోవడంతో ఇక్కడి పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి తోడు స్టేడియానికి వచ్చే క్రీడాకారులకు మైదానాలు కూడా సరిగా లేకపోవడంతో ఆయా పాఠశాలల్లోనే సాధన చేయాల్సి వస్తున్నది. స్టేడియంలోని కబడ్డీ మైదానంలో బండలు తేలి ఉండడంతో క్రీడాకారులే బాగుచేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఖోఖో మైదానం పూర్తిగా గుంతలతో నిండి ఉంది. వాలీబాల్‌ కోర్టులో చిరిగిపోయిన నెట్‌పైనే స్థానిక క్రీడాకారులు సాధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా క్రీడాకారులు ఇవే మైదానాల్లో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. 


స్థానికంగా కోచ్‌లను నియమించుకోవాలి ..

ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ అల్లీపూరం వెంకటేశ్వర్‌రెడ్డి కోచ్‌లను స్థానికంగా కలెక్టర్‌తో మాట్లాడి నియమించుకోవాలని ఆదేశించారు. కానీ ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకునే వారు కరువవడంతో కోచ్‌ల నియామకాలు లేక క్రీడాకారులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. సరైన శిక్షణ లేక తమకు తెలిసిన పరిజ్ఞానంతోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.


160 మంది విద్యార్థులకు ముగ్గురే కోచ్‌లు.. 

తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ను కూడా కోచ్‌ల కొరత వేధిస్తున్నది. మొత్తం నాలుగు బ్యాచ్‌ల్లో కలిపి 160 మంది విద్యార్థులకు శారీరక శిక్షణతో పాటు, వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడానికి సైతం కేవలం ముగ్గురు కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. స్పోర్ట్స్‌ స్కూల్‌లో 4వ తరగతి విద్యార్థులకు రెండేండ్ల పాటు కేవలం శారీరక శిక్షణ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వారి శారీరక ధర్మాన్ని బట్టి వారు దేనిలో రాణిస్తే ఆ క్రీడాంశాలను నేర్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, జూడో క్రీడాంశాలకు మాత్రమే కోచ్‌లు ఉన్నారు. వీరిలో ఒకరు సెలవు పెట్టినా, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లినా సగం మంది క్రీడాకారుల పరిస్థితి దారుణం. ఉన్న కోచ్‌లు తమకున్న విద్యార్థులను చూసుకోవాలో లేదా మిగితా వారిని చూడాలో అర్థం గాని పరిస్థితి నెలకొంటున్నది. దీనికి తోడు సాట్స్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో కోచ్‌లు బయటి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కలుగ జేసుకొని స్థానికంగా నైనా ఎన్‌ఐఎస్‌ సర్టిఫికెట్‌ ఉన్న సీనియర్‌ క్రీడాకారులను కోచ్‌లుగా నియమించాలని కోరుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

జిల్లాలోని స్టేడియాల్లో కోచ్‌ల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే పలుమార్లు సాట్స్‌ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది. ఇటీవల సాట్స్‌ చైర్మన్‌ ఆదిలాబాద్‌ వచ్చినపుడు కోచ్‌ల కొరత గురించి అడిగాం. స్థానికంగా భర్తీ చేసుకోవాలని సూచించారు. దానితో కలెక్టర్‌కు ఫైల్‌ పంపుతున్నాం.

- వెంకటేశ్వర్లు, డీవైఎస్‌వో, ఆదిలాబాద్‌. logo
>>>>>>