శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 21, 2020 , 04:10:39

శివపూజకు వేళాయె..

శివపూజకు వేళాయె..

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

  • మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు
  • శివపార్వతుల కల్యాణానికి ఏర్పాట్లు
  • రంగులు, విద్యుత్‌దీపాలతో ఆలయాలు ముస్తాబు

ఆదిలాబాద్‌ రూరల్‌ : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బారీగా తరలివచ్చే భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయం, రాంనగర్‌లోని శివాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ బారీ కేడ్ల నిర్మాణం చేపట్టి భక్తులను క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచే భక్తుల దర్శనం కోసం శివాలయాలను తెరిచి ఉంచనున్నారు. ఆలయాలన్నింటినీ గురువారం రాత్రి నుంచే విద్యుత్‌ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాలల్లో నిర్వహించే శివపార్వతుల కల్యాణం కోసం తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆలయాల్లో టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పండుగ సందర్భంగా చాలా మంది భక్తులు ఉపవాసాలు ఉండడంతో శుక్రవారం రాత్రి జాగరణ కోసం కూడా భజనలు, భక్తి పాటలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు ఉన్నారు. న్యూహౌసింగ్‌ బోర్డు, పాత హౌసింగ్‌బోర్డులోని ఆలయాలతో పాటు అంకోలి రోడ్‌లో ఉన్న శివాలయంలోనూ శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.


బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో 108శివలింగాల ప్రదర్శన..

జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ రోడ్‌లో ఉన్న బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ సంస్థ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భారీ శివలింగం ఏర్పాటుతో పాటు 108 శివలింగాలతో ప్రత్యేకంగా శివరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు.  


మార్కెట్‌కు శివరాత్రి కళ.. 

శివరాత్రికి భక్తులు ఉపవాసాలు ఉండి పండ్లతో ఒక్కపొద్దు విరమిస్తారు. దీంతో మార్కెట్‌కు పండుగ కళవచ్చింది. ఉపవాసం ఉన్న భక్తులు ఎక్కువగా పండ్లు తీసుకోనే అవకాశం ఉండడంతో మార్కెట్‌లో పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తినే రత్నపురి గడ్డలు మార్కెట్‌కు భారీగా వచ్చాయి. వీటితో పాటు సేపులు, అరటిపళ్లు, అంగూర్లు, కర్జూర వంటి పండ్లను భక్తుల కోసం అమ్మకానికి సిద్ధంగా ఉండారు. 


కోరికలు తీర్చే నందీశ్వరుడు.. 

బేల : మండలంలోని బాది గ్రామ శివారులో ఉన్న నందీశ్వర ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దకాలంలో నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. ఆలయంలోని నందీశ్వరున్ని ఏదైనా కోరుకొని లింగం లేపితే అది తేలికగా పైకి లేస్తుందని భక్తుల నమ్మకం. మండల కేంద్రం నుంచి 90కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. జిల్లా కేంద్రం నుంచి 32కిలో మీటర్లు ఉన్న ఈ ఆలయానికి ఆదిలాబాద్‌ నుంచి సిర్సన్న వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనంలో ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయంలో గిరిజనులు, జుగ్నాకే వంశీయులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఐదు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. గురువారం నుంచి ప్రారంభమైన జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆలయ కమిటీ అధ్యక్షుడు గాంధీ తెలిపారు. 


భోరజ్‌లో భారీ శివలింగం.. 

జైనథ్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జైనథ్‌ మండలంలోని బోరజ్‌లోని భారీ శివలింగంతో పాటు కొరాట, కంఠ కోఠిలింగాలు, అడ, దీపాయిగూడ, పెండల్‌వాడ, లక్ష్మీపూర్‌ మార్కండేయ ఆలయాలు ముస్తాబయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనం కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను నిర్మించారు. 

శుక్రవారం జాగరణ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత్‌ దీపాలు, రంగులతో అందంగా అలంకరించారు. 


చెరువు చెంతన సిరిచెల్మ మల్లన్న ఆలయం

ఇచ్చోడ : చెరువు సమీపంలో ఉన్న మండలంలోని సిరిచెల్మ మల్లన్న ఆలయం శివరాత్రి పర్వదినం ఉత్సవాలకు సిద్ధమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మందిరాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయానికి రంగురంగుల విద్యుత్‌ దీపాలను అలంకరించారు. దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భక్తుల జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ గుండాల లక్ష్మీకన్నమయ్య తెలిపారు. 


ఉత్సవాలకు ముస్తాబైన మార్కండేయ ఆలయం 

బోథ్‌, నమస్తే తెలంగాణ : బోథ్‌లోని శివభక్త మార్కండేయ ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యింది. ఆలయానికి వివిధ రకాల రంగులు వేసి విద్యుత్‌ దీపాలను అమర్చారు. శుక్రవారం ఉదయం నుంచి అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ పూజారి అమరేందర్‌ తెలిపారు. భక్తుల కోసం ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారని అన్నారు. విఠలేశ్వర ఆలయంలో కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 12 గంటలకు శివ పార్వతుల కల్యాణోత్సవం, రాత్రి సమయంలో రుద్రాభిషేకం ఉంటుందని వేద పండితుడు సదానందశర్మ తెలిపారు. 


శాతవాహన కాలంనాటి ఆలయం..

జైనథ్‌ : సదల్‌పూర్‌లో శాతావాహనుల కాలంలో నిర్మించిన మహదేవుని ఆలయం ఎంతో మహిమ కలది. ఇక్కడ శివరాత్రిని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు చుట్టు పక్కల ఉన్న మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇది బేల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. 


చరిత్రకు చిహ్నం.. గుడిహత్నూర్‌ శివాలయం 


గుడిహత్నూర్‌ : మండల కేంద్రంలో ఉన్న శివాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తున్నది. వంద ఏండ్లకు పైబడిన పురాతన కాలం నాటి గుడి ప్రత్యేకత సంతరించుకున్నది.ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున వందలాది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి జాగరణం సందర్భంగా గుడి ముందర భజన, పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడిలో శివలింగంతోపాటు దుర్గాదేవి, విఠల్‌ - రుక్మాబాయి దేవతా విగ్రహాలు ఉన్నాయి. పరిసర గ్రామాల్లో శివాలయం లేకపోవడంతో పాటు ఈ గుడిని మహా శివభక్తులే నిర్మించారని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినం రోజు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 


పాత ఉట్నూర్‌లోని శివాలయం.. 

ఉట్నూర్‌ రూరల్‌ : మండలంలోని పాత ఉట్నూర్‌లో ఉన్న శివాలయం నేడు జరిగే శివరాత్రి ఉత్సవాల కోసం సిద్ధమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న చెత్తాచెదారాన్ని గ్రామ పంచాయతీ ఈవో సత్యనారాయణ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించారు. ఈ ఆలయానికి వంద ఏండ్లకు పైగా చరిత్ర ఉందని గ్రామస్తులు తెలిపారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. 


నేడు శివపార్వతుల కల్యాణం 

సిరికొండ : మండలం కేంద్రంతో పాటు కొండాపూర్‌ గ్రామంలోని వాగు సమీపంలో అతి పురాతన శివాలయం ఉన్నాయి. గురువారం శివాలయాలను మహాశివ రాత్రి పురస్కరించుకొని ఆలయాలను నీటితో శభ్రం చేశారు. శివలింగం, గుడి శిఖరాన్ని శుభ్రం చేశారు. కొండాపూర్‌ శివాలయంలో ప్రతి సంవత్సరంజాతర నిర్వహిస్తుంటారు. నిత్య పూజలతో ఆలయం కళకళలాడుతున్నది. సిరికొండలోని పురాతన శివాలయం స్థానంలో గ్రామస్తులు కొత్తగా ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శివకుమార్‌ మాట్లాడుతూ.. శివరాత్రి సందర్భంగా శుక్రవారం శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు. రుద్రహోమం, చండీ హోమం ఉంటాయని అన్నారు. గ్రామంలో శివపార్వతి విగ్రహాల ఊరేగింపు ఉంటుందని తెలిపారు. 


ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి.. 

తాంసి : మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వడ్డాడిలోని లక్ష్మీనరసింహ ఆలయం, పొన్నారిలోని మార్కండేయ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకలకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉత్సవాల సందర్భంగా రథోత్సవం, జాతర నిర్వహించనున్నారు. శనివారం పలు ఆలయాల వద్ద అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


పశుపతినాథ్‌ ఆలయంలో..

ముథోల్‌ : నిర్మల్‌ జిల్లా ముథోల్‌లోని శ్రీపశుపతినాథ్‌ శివాలయంలో శుక్రవారం వేకువజామున నుంచి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను ప్రారంభం కానున్నాయి. శనివారం ఆలయం లో ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహ కులు తెలిపారు. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారని పేర్కొన్నారు.


logo