సోమవారం 30 మార్చి 2020
Adilabad - Feb 21, 2020 , 04:08:56

ఇక ‘డీసీసీబీ’ సందడి

ఇక  ‘డీసీసీబీ’ సందడి

సహకారశాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. పీఏసీఎస్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తవగా, తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నది.

  • డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ
  • ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్‌
  • 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల నిర్వహణ
  • టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులు!

సహకారశాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. పీఏసీఎస్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తవగా, తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్‌ నిర్వహించనుండగా, 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ , చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సహకార శాఖ అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారిని నియమించింది.

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి


నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సహకారశాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. పీఏసీఎస్‌ పాలకవర్గాల ఎన్నికలు పూర్తవగా.. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికపై రాష్ట్ర సహకార శాఖ అధికారులు దృష్టి పెట్టారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సహకారశాఖ అధికారులు డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేశారు. 

ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సహకార శాఖ అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని డీసీసీబీలో 20మంది డైరెక్టర్లు, డీసీఎంఎస్‌లో పది మంది డైరెక్టర్లు ఉంటారు. డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లను జిల్లాలోని 77మంది పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లో ఆరుగురు డైరెక్టర్లను కూడా వీరే ఎన్నుకుంటారు. డీసీసీబీలో నలుగురిని డీసీఎంఎస్‌లో నలుగురిని, బీ గ్రేడ్‌ సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు ముందుగా 77 మంది ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు 16మంది  తమలో నుంచి  ఏ గ్రూపు నుంచి 16 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఎస్సీ కేటగిరి నుంచి ముగ్గురు, ఎస్టీ కేటగిరి నుంచి ఒకరు, బీసీ కేటగిరి నుంచి ఇద్దరు, ఓపెన్‌ కేటగిరి నుంచి పది మంది డైరెక్టర్లుగా ఉంటారు. దీంతో పాటు మరో నలుగురు బీ గ్రూపునకు సంబంధించిన వ్యవసాయేతర సహకార సంఘాల నుంచి ఎన్నిక జరుగుతుంది. ఎస్సీ నుంచి ఒకరు, ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, జనరల్‌ ఒకరు చొప్పున నలుగురు బీ గ్రేడ్‌ సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు.  మొత్తం 20 మంది డైరెక్టర్లను ఎన్నుకున్న అనంతరం డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. డీసీఎంఎస్‌లో పది మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రూపునకు సంబంధించి ఆరుగురు.. ఇందులో ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు, బీసీ ఒకరు, జనరల్‌ నుంచి ముగ్గురు డైరెక్టర్లను ఏ గ్రూప్‌ సభ్యులు ఎన్నుకుంటారు. నలుగురు డైరెక్టర్లను బీ గ్రూప్‌ సభ్యులు ఎన్నుకోగా.. ఇందులో ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ఇద్దరు జనరల్‌ నుంచి ఎన్నుకుంటారు. ఈ లెక్కన డీసీసీబీకి 20 మంది ఎన్నికవుతుండగా.. ఇందులో 16మంది ఏ గ్రూపు నుంచి, నలుగురు బి గ్రూపు నుంచి ఎన్నికవుతారు. డీసీఎంఎస్‌కు పది మంది ఎన్నికవుతుండగా.. ఏ గ్రూపు నుంచి ఆరుగురు, బీ గ్రూపు నుంచి నలుగురు ఎన్నికవుతారు. 


ఎన్నికల్లో నిలబడే వారిని ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. వీరికి రిజర్వేషన్ల వారీగా రంగుల బ్యాలెట్‌ పత్రాలను కేటాయించారు. ఎస్సీ కేటగిరి నుంచి పోటీ చేసే వారికి పింక్‌ రంగు బ్యాలెట్‌, ఎస్టీ నుంచి పోటీ చేసే వారికి లైట్‌ బ్లూ, బీసీ వారికి లైట్‌ గ్రీన్‌, జనరల్‌ వారికి వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ ఉంటుంది. డైరెక్టర్‌ పోస్టులకు ఒకరి కన్నా ఎక్కువ మంది వివిధ కేటగిరిల్లో నామినేషన్లు వేస్తే ఎన్నిక ఉంటుంది. రిజర్వేషన్ల ప్రకారం.. ఉన్న డైరెక్టర్‌ స్థానాలకు అంతే సంఖ్యలో నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం అయినట్లు ప్రకటిస్తారు. ఆయా కేటగిరిలో డైరెక్టర్లకంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారిని నియమించింది. ఈనెల 28న డైరెక్టర్ల ఎన్నిక ఉండగా.. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ఉంటుంది. అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా రహస్య బ్యాలెట్‌ విధానంలోనే ఉంటుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు కూడా ఒకరు ప్రతిపాదన, మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. జిల్లాలో 77 పీఏసీఎస్‌లు ఉండగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 71మంది సభ్యులు,  కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు ఏ గ్రూపు సభ్యులు ఉన్నారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పూర్తి మెజార్టీ ఉండడంతో ఈ పాలకవర్గాల ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకే టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.


డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికల షెడ్యూల్‌ ఇలా.. 


20.02.2020: డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికల నోటిఫికేషన్‌

22.2.2020: ఫాం-ఏ నోటీసు జారీ

25.02.2020: ఉదయం 8 గంటల  నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల స్వీకరణ, 1.30గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 3.30 నుంచి 5.00గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ

28.02.2020: ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

29.02.2020: డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక


logo