శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 19, 2020 , 23:36:20

వనం నుంచి..

వనం నుంచి..


భీంపూర్‌ : పులులు అభయారణ్యాల నుంచి సరిహద్దులు దాటి జనావాసల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండల పెన్‌గంగా పరీవాహక మారుమూల సరిహద్దు ఆవాసాలైన గొల్లగఢ్‌, తాంసి(కె) ప్రజలు పెద్ద పులి భయంతో  ఉన్నారు. చేలలో ఉన్న పంటలు ఇంటికి తీసుకురాలేని పరిస్థితి. అడవిలో తమ పశువులు ఇంకా ఎన్ని పులి పంజా బారిన పడ్డాయో అనేది స్పష్టంగా తెలుసుకోలేని  అయోమయం. నాలుగేండ్ల క్రితం డిసెంబరు 2016లో గొల్లగడ్‌, తాంసి(కె), పిప్పల్‌కోటి అడవుల్లో పెద్దపులి సంచరించి పదుల సంఖ్యలో ఆవులు, ఎడ్లను, అటవీ జంతువులను హతమార్చింది. అప్పుడు అధికారులు పంచనామా చేసి బాధిత రైతులకు పరిహారం ఇప్పించారు.  2016లో అప్పటి మహారాష్ట్ర పాండ్రకవడ డీఎఫ్‌వో గురుదేవ్‌, ఆదిలాబాద్‌ ఎఫ్‌డీవో రాంబాబు ఈ ప్రాంతాలను సందర్శించి నైట్‌విజన్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పులి సరిహద్దు దాటినట్లు భావించారు.  2016 డిసెంబరులో తాంసి బోడగుట్టపై ఒక ఆరేండ్ల చిరుత మృతి చెందిన విషయం అప్పట్లో కలకలం రేపింది. అది అనారోగ్యంతో మృతిచెందిందని అధికారులు ధ్రువీకరించారు. 


అడవులు విడిచి జనావాసాల వైపు..

సాధారణంగా మండు వేసవిలో అటవీ జంతువులైన మనబోతులు, జింకలు నీటి కోసం గ్రామాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏకంగా పెద్ద పులులే జనావాసాలకు అతి దగ్గరగా రావడం ఈ మధ్య జరుగుతున్నది. 2019 నవంబరు నెలలో పెన్‌గంగా ఆవలి సగ్ద గ్రామం వరకు పులి రావడంతో భీతిల్లిన ప్రజలు చాలా రోజులు చేనుల్లో పనులు మానేశారు. అనంతరం ఆ పులి తిప్పేశ్వర్‌ అభయారణ్యం వైపు వెళ్లిందని అధికారులు ధ్రువీకరించారు. తాజాగా మండలంలోని తాంసి(కె) పాఠశాల వెనుక ఉన్న పొదల్లో కూడా మొన్న పెద్ద పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


సందర్శకుల తాకిడితోనే..

అభయారణ్యాల్లో సందర్శకుల తాకిడికి కూడా పులులు ఒత్తిడికి గురవుతున్నాయని, దీంతో అవి అడవిని విడిచి వలస వస్తున్నాయని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ) అధ్యయనంలో వెల్లడయ్యింది. ఒత్తిడి పులుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నదని ల్యాక్నోస్‌ (ల్యాబొరేటరీ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండెంజెర్డ్‌ స్పీసేస్‌) శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ప్రస్తుతం జిల్లాలోని భీంపూర్‌, తాంసి మండలాలకు దగ్గరగా ఉన్న మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యానికి నిత్యం సందర్శకుల తాకిడి ఉన్న విషయం తెలిసిందే. ఎకో టూరిజం నిబంధనల ప్రకారం అభయారణ్యాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, క్రమపద్ధతిలో సందర్శకులకు అనుమతి ఇవ్వాలని, వాహనాల సంఖ్య తగ్గించాలని, అటవీప్రాంత గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించాలని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. పొరుగు రాష్ర్టాల నుంచి కవ్వాల్‌ రిజర్వు ఫారెస్టులోకి కూడా పులుల వలస పెరిగిందని అధికారులు చెప్తున్నారు.


ముందే హెచ్చరించిన వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌..

ఏడాది క్రితమే వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు ఆదిలాబాద్‌, తాంసి అడవుల వైపు రేడియోకాలర్‌ పులులు వచ్చాయని రాష్ట్ర అటవీశాఖను అప్రమత్తం చేశారు. మొదటి దశలో రేడియోకాలర్‌ బిగించిన పులులు రెండు తాంసి వైపు వచ్చాయని గుర్తించారు. ఆ సమయంలోనే తాంసి మండలం బండలనాగాపూర్‌, ఈదుల్లా సావర్గాంలో పులి కలకలం రేపింది. 


స్మగ్లర్లకు హెచ్చరికలు..

పెద్ద పులుల స్మగ్లర్లు ఉన్నారు జాగ్రత్త అంటూ ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్‌ క్రైం కంట్రోల్‌ బ్యూరో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. 2016లో మంచిర్యాల జిల్లా కోటపల్లిలో విద్యుత్‌ కంచెకు పెద్ద పులి బలైన ఉదంతం, 2015లో  గోదావరి నది ఒడ్డున పెద్ద పులి చర్మం స్వాధీనం లాంటి ఘటనలు విదితమే. మహారాష్ట్ర నాందేడ్‌ సమీపంలోని ఉమ్రేదకర్‌ హ్యాండ్లీ అభయారణ్యం నుంచి తప్పిపోయిన దేశంలోనే అతిపెద్దదైన  పులి ‘జై’ జాడ ఇప్పటికీ తెలియలేదు. ఇక అడవుల్లో వేట, కలప స్మగ్లింగ్‌ గణనీయంగా తగ్గినా.. అక్కడక్కడా ఇవి జరుగుతున్నట్లు  తెలుస్తున్నది. 


logo