సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 19, 2020 , 01:02:58

కందుల కొనుగోళ్లపై నిఘా

కందుల కొనుగోళ్లపై నిఘా

జిల్లాలో కందుల కొనుగోళ్లపై అధికారులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయితో పాటు మండలాల్లో విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పంటల కొనుగోళ్లలో క్రాప్‌ బుకింగ్‌ పద్ధతిని అవలంబిస్తున్నారు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • విజిలెన్స్‌ బృందాల ఏర్పాటు
  • క్రాప్‌ బుకింగ్‌ విధానం అమలు
  • సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు
  • నిల్వలపైనా నిఘా

జిల్లాలో కందుల కొనుగోళ్లపై అధికారులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయితో పాటు మండలాల్లో విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పంటల కొనుగోళ్లలో క్రాప్‌ బుకింగ్‌ పద్ధతిని అవలంబిస్తున్నారు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. 

- ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో పత్తి తర్వాత సోయాబిన్‌, కంది పంటను ఎక్కువగా పండిస్తారు. పత్తి, సోయాబిన్‌లో అంతర పంటతో పాటు విడి గా కందిని రైతులు సాగు చేస్తారు. ఈ ఏడాది సీజన్‌ ప్రా రంభం నుంచి ఈ పంట సాగుకు వర్షాలు బాగా పడడం తో పాటు, వాతావరణం కూడా అనుకూలించడంతో  దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారు లు అంచనా వేసి పంటను అమ్ముకొనేందుకు రైతులు ఇబ్బందుల పడకుండా పటిష్టమైన ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలోని అన్ని మార్కెట్‌ యార్డుల్లో నాఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది కంది క్వింటాకు రూ. 5800 మద్దతు ధర ప్రకటించగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఈ ధర లభిస్తుంది. జిల్లాలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల, తాంసి, ఇచ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌ మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాగా ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల ద్వారా పంట కొనుగోళ్లు చేపట్టారు. గతేడాది కంది క్వింటాకు రూ.5, 675 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది రూ.125 పెరిగిం ది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ.4,800 వరకు చెల్లిస్తుండగా సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాలుకు రూ.ఒక వేయి ఎక్కువ ధర లభిస్తుంది. జిల్లాలో ఈ సీజన్‌లో 2.22 లక్షల క్వింటాళ్ల పంటను సేకరించాలని అధికారులు లక్ష్యంగా ఎంచుకోగా వివిధ మార్కెట్‌యార్డుల్లో పంట కొనుగోళ్లు సాగుతున్నాయి.


క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా కొనుగోళ్లు.. 

రెండేండ్ల కిందట జిల్లాలో కందుల కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. ఇందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులను గత కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. గతేడాది నుంచి జిల్లాలో పంటల కొనుగోళ్లలో అక్రమాలు జరుగకుండా అధికారుల పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఇందుకోసం క్రాప్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సీజన్‌కు ముందుగా వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో రైతులు ఏ పంటను ఎన్ని ఎకరాల్లో సాగుచేశారనే వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. పంటను విక్రయించేందుకు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చే రైతు ఎన్ని ఎకరాల్లో పంటను సాగుచేశాడు..? దిగుబడి ఎంత వస్తుందనే వివరాల మేరకు రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తున్నారు.


విజిలెన్స్‌ బృందాల ఏర్పాటు.. 

కందుల కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని నివారించడంతో పాటు అక్రమాలు జరుగకుండా జిల్లా, మండల స్థాయిలో విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో డీఎస్పీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఆర్‌డీవో, డీసీవో ఉంటారు. మండల స్థాయి బృందాల్లో తహసీల్దార్‌, ఎస్సై, మండల వ్యవసాయశాఖ అధికారి, మార్కెటింగ్‌ కార్యదర్శులు ఉంటారు. ఈ బృందాలు కందుల నిల్వలపై పక్కా సమాచారాన్ని సేకరించి దాడులు నిర్వహిస్తారు. పంటల కొనుగోళ్లపై నిఘా పెట్టి దళారులు పంటను మార్కెట్‌ యార్డుల్లో విక్రయించకుండా చర్యలు తీసుకుంటారు.  జిల్లా సరిహద్దుకు అనుకొని మహారాష్ట్ర గ్రామాలు ఉండడంతో అక్కడి నుంచి పంట జిల్లాకు రా కుండా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంటను విక్రయించేందుకు రైతు కుటుంబ సభ్యులు రావాలని అధికారులు కోరుతున్నారు.


పకడ్బందీ ఏర్పాట్లు.. 

జిల్లాలో కందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. క్రాప్‌ బుకింగ్‌ పద్ధతిలో పంటను కొనుగోలు చేస్తున్నాం.  మార్కెట్‌ యార్డులకు పంటను అమ్మేందుకు రైతు కుటుంబసభ్యుల రావాలని ఇప్పటికే తెలియజేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కందుల నిల్వలపై విజిలెన్స్‌ బృందాలు దాడులు నిర్వహిస్తారు. మహారాష్ట్ర నుంచి పంట జిల్లాకు రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాం. కందుల అమ్మకాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయి.

- పుల్లయ్య, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌. 


logo