శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Feb 19, 2020 , 00:54:15

ప్రపంచానికి ఆదర్శం సేవాలాల్‌ మహరాజ్‌

ప్రపంచానికి ఆదర్శం సేవాలాల్‌ మహరాజ్‌

బంజారాల ఆరాధ్యదైవం అయిన శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ ప్రపంచానికే ఆదర్శమని జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని మంగళవారం అధికారికంగా నిర్వహించారు.

  • ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలి
  • బంజారాల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషి
  • జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌
  • జిల్లా కేంద్రంలో ఘనంగా సేవాలాల్‌ జయంతి

బంజారాల ఆరాధ్యదైవం అయిన శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ ప్రపంచానికే ఆదర్శమని జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన మార్గంలో నడుచుకోవాలని జడ్పీ చైర్మన్‌ అన్నారు. విద్యాతోనే అభివృద్ధి సాధ్యమని, బంజారాలు తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించాలని సూచించారు. బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌, తెలంగాణ సర్కారు ఎనలేని కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా బంజారాల వేషధారణ, నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

- ఆదిలాబాద్‌ రూరల్‌ విలేకరి


ఆదిలాబాద్‌ రూరల్‌ : బంజారాల ఆరాధ్యదైవమైన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ యావత్‌ ప్రపంచానికి మార్గదర్శకమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో మంగళవారం అధికారికంగా నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలను ఆయన బోథ్‌ ఎమ్యెల్యే రాథోడ్‌ బాపూరావుతో కలిసి ప్రారంభించారు. మొదట సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. సంత్‌ సేవాలాల్‌ బంజారాలను చైతన్యం చేసి సమాజంలో మార్పు తీసుకొచ్చారన్నారు. శాంతి, అహింసా మార్గంలో పయనిస్తూ తమ సమస్యలను సాధించుకోవాలని సేవాలాల్‌ సూచించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బంజారాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యమంతి కేసీఆర్‌ బంజారాల ఆరాధ్యదైవమైన సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. చదువుతోనే అభివృద్ధి  సాధ్యమని, బంజారాలు తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సేవాలాల్‌ అశీర్వాదంతోనే నేడు తాను జడ్పీచైర్మన్‌ అయ్యానన్నారు. తెలంగాణ వచ్చాక లంబాడా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి బంజారాలను వార్డుమెంబర్లు, సర్పంచులు, జడ్పీటీసీ నాయకులుగా తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 


బంజారాలది ప్రాచీన చరిత్ర..

సింధూ నాగరికత కాలం నుంచి బంజారాలకు ప్రత్యేక చరిత్ర ఉందని బోథ్‌ ఎమ్యెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. బంజారాలకు సంత్‌ సేవాలాల్‌, హతిరాం బాబాలు కులగురువులని, ప్రతి ఒక్కరూ వారు చూపిన మార్గంలో నడిచి బంజారా జాతిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణలో బంజారాలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో బంజారాలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌ కేంద్రాల్లోనూ బంజారా భవనాలకు స్థలాలు కేటాయించేలా చూస్తామన్నారు. 


సమస్యలను పరిష్కరిస్తాం.. 

ఐటీడీఏ పీవో భావేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో నివసించేందుకు సేవాలాల్‌ మహరాజ్‌ 22 సూత్రాలు ప్రతిపాదించారన్నారు. వాటిని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రశాంత జీవనం గడపవచ్చన్నారు. ఆయన ప్రపంచానికే ఆదర్శమన్నారు. 300 ఏళ్ల క్రితమే ఆయన భవిష్యత్‌ వాణిని వినిపించారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితితులు తన దృష్టికి వచ్చాయని అందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. భారత దేశ చట్టాల ప్రకారం.. ప్రతి గిరిజనుడికి న్యాయం చేసేలా అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. బంజారాల అభివృద్ధి కోసం సేవాలాల్‌ మహరాజ్‌ అనేక పోరాటాలు చేశారన్నారు. ఆర్‌వో పట్టాలు త్వరలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్‌లో భిన్నత్వంలో ఏకత్వం కనబడుతున్నదని, అన్ని కులమతాలు కలిసి సహజీవనం చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం బంజారా సేవా సంఘం నాయకులు అమర్‌సింగ్‌ తిలావత్‌, రాథోడ్‌ రమేశ్‌, అనిల్‌ జాదవ్‌, బాపూరావు తదితరులు బంజారాలకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలకు అర్హత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు బంజారా మహిళలు, చిన్నారులు తమ సంప్రదాయ దుస్తులు వేసుకొని వచ్చి నృత్యాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఐటీడీఏ డీడీ చందన, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకల అధ్యక్షులు రాథోడ్‌ రామారావు, బాపూరావు, టీజీవోల అధ్యక్షుడు రాథోడ్‌ శ్యాంనాయక్‌, కౌన్సిలర్‌ పవన్‌జాదవ్‌, రైతు సమన్వయ సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌, నాయకులు యూనిస్‌ అక్బానీ, చారులత, సుమన్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo