శనివారం 28 మార్చి 2020
Adilabad - Feb 17, 2020 , 23:31:08

డీసీసీబీపై ‘గులాబీ’ గురి..!

డీసీసీబీపై ‘గులాబీ’ గురి..!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వరుస ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తూ తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎదిగింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి తాజాగా జరిగిన సహకార ఎన్నికల వరకు.. ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం గులాబీ పార్టీదే అవుతున్నది. తాజాగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో కారు జోరు కొనసాగగా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ పూర్తిగా డీలా పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. 


పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలైనప్పటికీ.. సహకార ఎన్నికల్లో గులాబీ పార్టీ తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77 పీఏసీఎస్‌లు ఉండగా.. 71 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. నిర్మల్‌ జిల్లాలో 17సహకార సంఘాలకు గాను.. 15, ఆదిలాబాద్‌ జిల్లాలో 28 సంఘాలకుగాను.. 25, ఆసిఫాబాద్‌ కుమ్రంభీం జిల్లాలో 12 సంఘాలకుగాను.. 12, మంచిర్యాల జిల్లాలో 20 సంఘాలకు గాను 19చొప్పున పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు.కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12 పీఏసీఎస్‌లను గెలుచుకుని.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెరో మూడు పీఏసీఎస్‌లు మాత్రమే దక్కించుకున్నాయి. 


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి, నిర్మల్‌ జిల్లా కుంటాల, సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) పీఏసీఎస్‌లను కాంగ్రెస్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి-బి, నర్సాపూర్‌, గుడిహత్నూర్‌ పీఏసీఎస్‌లను బీజేపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అసలు బోణీ కూడా చేయలేదు. ఈ రెండు జాతీయ పార్టీల పరిస్థితి దొందు దొందే అన్నట్లుగా మారిపోయింది. పీఏసీఎస్‌లను దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ పరిషత్‌ చైర్మన్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. 77 పీఏసీఎస్‌లలో.. 71 పీఏసీఎస్‌లను గెలుచుకొని తమ సత్తా ఏంటో చాటారు. 95 శాతానికిపైగా పీఏసీఎస్‌లు దక్కించుకొని టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు తమ సత్తా ఏంటో చూపించారు. టీసీల డైరెక్టర్లతో పాటు పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తవడంతో.. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులపై అందరి దృష్టి పడింది. 


ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా.. 2013 పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 21మంది డీసీసీబీ డైరెక్టర్లుండగా.. వీటిలో 16మంది పీఏసీఎస్‌ల నుంచి, ఐదుగురు మంది వివిధ రకాల సొసైటీల నుంచి వస్తారు. త్వరలోనే డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత.. స్వరాష్ట్రం రావడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వివిధ పార్టీల మద్దతుదారులైన వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ 71 పీఏసీఎస్‌లను దక్కించుకోవడంతో.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులను కూడా తన ఖాతాలో వేసుకోనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. డీసీసీబీ డైరెక్టర్ల కోసం మంత్రి అల్లోలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం ప్రయత్నాలు మొదలవగా.. నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు సమానంగా ఇచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉండడంతో.. డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఆ పార్టీ మద్దతుదారులకే దక్కనున్నాయి.


logo