శనివారం 28 మార్చి 2020
Adilabad - Feb 17, 2020 , 00:16:42

పీఏసీఎస్‌లపై గులాబీ జెండా

పీఏసీఎస్‌లపై గులాబీ జెండా

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ  ప్రతినిధి : జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల్లో ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. జిల్లా వ్యాప్తంగా 28 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా 25 సంఘాల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థు లు విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు రెండు చోట్ల ఎంపిక కాగా కాంగ్రెస్‌కు ఏ ఒక్క పీఏసీఎస్‌ కూడా దక్కలేదు. జిల్లాలోని కుమారి పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సభ్యులు ఆలస్యంగా రావడంతో సోమవారానికి వాయిదా పడింది. ప్రాథమిక సహకార సంఘాలకు శనివా రం జరిగిన ఎన్నికల్లో 360 డైరెక్టర్‌ స్థానాలకు గానూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 252, బీజేపీ మద్దతుదారులు 67, కాంగ్రెస్‌ మద్దతుదారులు 22, ఇతరుల 19 స్థానాల్లో విజ యం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం 28 ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు ఎన్నిక నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల విజయంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.


జిల్లాలో ఆదివారం ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం ఉదయం 11 గంటలకు ప్రక్రియను ప్రారంభించారు. సాయంత్రం 4.30  గంటల వరకు ఈ ఎన్నికల నిర్వహణ కొనసాగింది. ఏకగ్రీవాలను మినహాయించి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన సహకార సంఘాల ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభకాగానే నామినేషన్ల గడువు ముగిసేంతవరకు ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇచ్చోడ మండలం జామిడి(బీ), నర్సాపూర్‌లో బీజేపీ మద్దతుదారులు రెండు పదవులను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌, ఇతరులకు ఏ ఒక్క స్థానం కూడా దక్కలేదు. జిల్లాలోని 26 సొసైటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ ఉండడంతో మిగితా వారి మద్దతు లేకుండానే గులాబీ పార్టీ మద్దతుదారులు పీఠాలను దక్కించుకున్నారు. దీంతో విజయం సాధించిన అభ్యర్థులు వారి అనుచరులు సంబురాలు చేసుకున్నారు.


26 పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులవే..  

 జిల్లాలోని 28 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా 26 చోట్ల గులాబీ పార్టీ మద్దతుదారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. లండసాగ్వి, తాంసి, జామిడి(ఏ), హస్నాపూర్‌, గూడ రాంపూర్‌,  ముక్రా, మాన్కాపూర్‌,  నార్నూర్‌, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌, చాందా(టీ), తంతోలి, తలమడుగు, ఝరి, జైనథ్‌, మేడిగూడ, బేల, డోప్టాల, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, మన్నూర్‌, నేరడిగొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌ ప్రాథమిక సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. జామిడి(బీ), నర్సాపూర్‌ పీఏసీఎస్‌లలో బీజేపీ మద్దతుదారులు ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో కుమారి పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను సోమవారం నిర్వహించనున్నారు. 


నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ నోటిఫికేషన్‌.. 

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎంఎస్‌)  పాలకవర్గాలను పీఏసీఎస్‌లకు ఎన్నికైన చైర్మన్లు ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ కానుండగా వారం రోజుల్లో డీసీసీబీ ఎన్నికలు నిర్వహిస్తారు. పాత జిల్లాలో ఎన్నికైన పీఏసీఎస్‌ల చైర్మన్లు డీసీసీబీకి 16 మంది పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. అనంతరం డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగుతుంది. 


logo