గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 16, 2020 , 01:47:08

సరిలేరు టీఆర్‌ఎస్‌ కెవ్వరు..!

సరిలేరు టీఆర్‌ఎస్‌ కెవ్వరు..!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:ఏకగ్రీవాల్లోనే కాదు.. ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ఎవ్వరూ సరిలేకుండా పోయారు.. ఎన్నిక ఏదైనా.. గెలుపు గులాబీదే అన్నట్లుగా మరోసారి రుజువైంది.. తాజా గా నిర్వహించిన సహకార ఎన్నికల్లో గులాబీ మద్దతుదా రుల జోరు కొనసాగింది.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గులాబీ మద్దతుదారులదే పూర్తి గుత్తాధిపత్యం కనిపిస్తోంది.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉండగా.. 74పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు దక్కించుకోగా.. ఒక చోట కాంగ్రెస్‌, రెండు చోట్ల బీజేపీ మద్దతుదారులు దక్కించుకుంటున్నారు. మొత్తం 993టీసీలకుగాను.. 778టీసీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుచుకున్నారు.. కాంగ్రెస్‌ ఒక చోట, బీజేపీ రెండు చోట్ల మెజారిటీ టీసీలు దక్కించుకోగా.. మూడు జిల్లాల్లో అసలు బోణీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది..!


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని స్థానం దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ సబ్బండ వర్ణాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారు. తాజాగా జరిగిన సహకార ఎన్నికల్లోనూ కర్షకులు టీఆర్‌ఎస్‌వైపే నిలిచారు. గులాబీ పార్టీ మద్దతుదారులకు జై కొట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77పీఏసీఎస్‌లు ఉండగా.. వీటి పరిధిలో మొత్తం 993టీసీలకు ఎన్నికలు నిర్వహించారు. 


ఇందులో 607టీసీలు ఏకగ్రీవమవగా.. వీటిలో ఎక్కువగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఉన్నారు. మరో 386టీసీలకు ఎన్నికలు నిర్వహించగా.. అందులో మెజారిటీ స్థానాలు టీఆర్‌ఎస్‌ వారే దక్కించుకున్నారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 778టీసీలను దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ మద్దతుదారులు 108చోట్ల, బీజేపీ మద్దతుదారులు 63చోట్ల, ఇతరులు 34చోట్ల టీసీలను గెలుచుకున్నారు. పీఏసీఎస్‌లలోనూ టీఆర్‌ఎస్‌ తన దూకుడును ప్రదర్శించింది. జిల్లాలో మొత్తం 77పీఏసీఎస్‌లకుగాను.. 74చోట్ల టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను దక్కించుకున్నారు. మరో రెండు చోట్ల బీజేపీ, ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్‌ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నారు. 


ఇకనిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అన్ని పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుచుకునే అవకాశముండగా.. ఆదిలాబాద్‌లో రెండు బీజేపీ, మంచిర్యాలలో ఒకటి కాంగ్రెస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఏకగ్రీవాల్లో 22పూర్తిగా గులాబీ మద్దతుదారులే గెలుచుకున్నారు. మూడు జిల్లాల్లో కాంగ్రెస్‌, బీజేపీలు అసలు బోణీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో బీజేపీ.. ఒక్క పీఏసీఎస్‌ కూడా దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది. తాజా ఫలితాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నయాజోష్‌ కనిపిస్తుండగా.. కాంగ్రెస్‌, బీజేపీల్లో నిరుత్సాహం, నిస్తేజం అలుముకుంది. మొత్తానికి సహకార ఎన్నికల్లో కారుకెవరు సరిలేన్నట్లుగా కర్షకులు తీర్పు ఇచ్చారు.  


logo