మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 16, 2020 , 01:22:23

త్వరలో జిల్లాలో సీఎం పర్యటన

త్వరలో జిల్లాలో సీఎం పర్యటన

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పేద ప్రజలకు సేవలందించడం ద్వారా గౌరవం లభిస్తుందని, విధి నిర్వహణను ధర్మంగా భావించాలని కలెక్టర్‌ దేవసేన అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో పట్టణ, పల్లె ప్రగతిపై దిశానిర్దేశం చేశారని తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో పనిచేస్తే వంద శాతం ప్రగతి సాధించవచ్చన్నారు. రానున్న రెండు నెలల్లో సీఎం పర్యటనకు రానున్నారని తెలిపారు. ఆలోపు పట్టణాలు, పల్లెల్లో పలు అంశాలపై అధికార యంత్రాగం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల రూపురేఖలు మార్చేవిధంగా యంత్రాంగం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయాలని సూచించారు. మరుగు దొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, తగి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి కంపోస్ట్‌ పిట్‌కు తరలించాలని తెలిపారు. ప్రతి ఇంట్లో పెరటి తోట (కిచెన్‌ గార్డెన్‌) ఉండేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను నిర్విరామంగా కొనసాగించి పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. 


అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫంక్షన్‌హాల్‌, కమర్షియల్‌ ప్రాంతాల చెత్తను విడివిగా సేకరించాలని తెలిపారు. వర్షాకాలనికి ముందే ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచి 85 శాతం సంరక్షించాలని, లేని పక్షంలో సర్పంచులను బాధ్యులుగా చేస్తామని తెలిపారు. మొక్కల సంరక్షణకు వాచర్స్‌ను నియమించుకోవాలని సూచించారు. ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలన్నారు. కేవలం సంతకం మాత్రమే కాదని, రాయడం, చదవడం రావాలన్నారు. గతంలో మండలాల వారీగా నియమించిన ప్రతేక అధికారులు వారానికి రెండు రోజులు (మంగళ, శుక్ర) వారాల్లో గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించి ఆయా వార్డుల్లో కొనసాగుతున్న పను ల వివరాలు సేకరించాలన్నారు. 


స్వచ్ఛ టోలను ఏర్పాటు చేసుకొని పట్టణ సుందరీకరణకు గ్రీన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు, సులభ్‌ కాంప్లెక్సులను ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోల్‌ బంకుల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయించాలని, అందుకోసం నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలన్నారు. పందులను ఊరికి దూరంగా ఉంచాలన్నారు. త్వరలో మున్సిపాలిటీల్లో ఖాళీలు భర్తీ కానున్నాయని మున్సిపల్‌ శాఖ మంత్రి పేర్కొన్నారని తెలిపారు. కార్యక్రమంలో సహయ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జిల్లా రెవెన్యూ అధికారి నటరాజన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 


logo
>>>>>>