శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 14, 2020 , 23:13:04

ఉగ్రవాదులకు గుణపాఠం తప్పదు

ఉగ్రవాదులకు గుణపాఠం తప్పదు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి హేయమైన చర్య అని, మానవత్వం లేని ఉగ్రవాదులకు గుణపాఠం తప్పదని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్గిల్‌ అరవీరుల స్తూపం వద్ద అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి కలుగాలని నివాళులర్పించారు. స్తూపానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని అన్నారు. ఉగ్రదాడిలో 40మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి త్యాగాలు వృథా కావని, భారతజాతి మొత్తం వారి సేవలను స్మరించుకుంటుందన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల త్యాగాలతోనే ప్రజలు ప్రశాంతంగా నిద్ర పోతున్నారని అన్నారు. జవాన్లను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నామని, అసువులుబాసిన జవాన్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, కౌన్సిలర్లు పవన్‌నాయక్‌, ఆవుల వెంకన్న, నాయకులు కొండ గణేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

బేల: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను స్మరిస్తూ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకొని జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు హరీశ్‌ మండల కార్యదర్శి ఓంప్రకాశ్‌ మాట్లాడుతూ పుల్వామా దుర్ఘటన దేశంలో విషాదాన్ని నింపిందని అన్నారు. జవాన్ల త్యాగాలను దేశం స్మరించుకుంటున్నదని అన్నారు. కార్యక్రమంలో ఏబీపీవీ నాయకులు అజయ్‌, సాయి, ప్రశాంత్‌, మహేశ్‌, జీవన్‌, కైలాస్‌, వికాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

అంగన్‌వాడీ కేంద్రంలో..

ఎదులాపురం: పుల్వామా దాడిలో ప్రాణాలు కొల్పోయిన వీర జవాన్లకు సుందరయ్యనగర్‌లోని అంగన్‌వాడీ-1 కేంద్రంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ రాధ, సామజిక కార్యకర్త రాజు, చిన్నారులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ..

ఎదులాపురం: బెస్ట్‌ ఫ్రెండ్స్‌ హెల్ప్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అమర జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో తెలంగాణచౌక్‌లో సైనికుల అత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌సీఐ సురేశ్‌, సొసైటీ సభ్యులు అజీజ్‌, గుండి మహేశ్‌, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.


logo