శనివారం 29 ఫిబ్రవరి 2020
టార్గెట్‌.. 42.94 లక్షల మొక్కలు

టార్గెట్‌.. 42.94 లక్షల మొక్కలు

Feb 13, 2020 , 23:56:44
PRINT
టార్గెట్‌.. 42.94 లక్షల మొక్కలు

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం నెలకొనేలా అధికారులు పక్కా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల్లో 42.94 లక్షల మొక్కలను పెంచాలని అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో నర్సరీల కోసం స్థలాలను గుర్తించిన అధికారులు మొక్కల పెంపకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ నర్సరీల ఏర్పాటులో భాగంగా ప్లాస్టిక్‌ కవర్లలో మట్టి నింపడం త్వరలో పూర్తి చేయాలని ఆదేశించగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.

పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పడంతో పాటు పచ్చదనం ఉట్టిపడేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో రెండు విడతలూ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో పలు చోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. పల్లెల్లోని వివిధ ప్రాంతాల్లో నాటేందుకు అవసరమైన మొక్కల కోసం అధికారులు గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకాన్ని చేపట్టారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి పంచాయతీ ఆధ్వర్యంలో 40 వేల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం సర్పంచులు, స్థానికుల సహకారంతో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కల పెంపకం కోసం స్థలాలను గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాల్లో మొక్కలను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచనున్నారు. ఇండ్లలో ప్రజలకు అవనసరమై పండ్లు, పూల మొక్కలు, రోడ్లకు ఇరువైపుల, రైతుల భూముల్లోని గట్లపై, గ్రామాల్లోని వివిధ ప్రాంతాల్లోని గుర్తించిన స్థలాల్లో అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు.

- 42.94 లక్షల మొక్కల పెంపకం 

జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల్లో 42.94 లక్షల మొక్కలను పెంచాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో 34 గ్రామ పంచాయతీల్లో 2.27 లక్షల మొక్కలు, బజార్‌హత్నూర్‌ మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో 1.68 లక్షలు, బేల మండలంలోని 37 పంచాయతీల్లో 4.38 లక్షల మొక్కలు, భీంపూర్‌ మండలంలో 26 గ్రామ పంచాయతీల్లో 2.37 లక్షల మొక్కలు, బోథ్‌ మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో 2.61 లక్షల మొక్కలు, గాదిగూడ మండలంలో 25 పంచాయతీల్లో 1.44 లక్షలు, గుడిహత్నూర్‌ మండలంలో 26 పంచాయతీల్లో 1.52 లక్షల మొక్కలు, ఇచ్చోడ మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 1.85 లక్షల మొక్కలు, ఇంద్రవెల్లి మండలంలో 28 పంచాయతీల్లో 3.50 లక్షలు, జైనథ్‌ మండలంలోని 42 గ్రామ పంచాయతీల్లో 2.47 లక్షలు, మావల మండలంలో 3 పంచాయతీల్లో 70 వేలు, నార్నూర్‌ మండలంలో 23 పంచాయతీల్లో 2.15 లక్షలు, నార్నూర్‌ మండలంలో 23 పంచాయతీల్లో 2.15 లక్షలు, నేరడిగొండ మండలంలో 32 పంచాయతీల్లో 2.51 లక్షలు, సిరికొండ మండలంలో 19 పంచాయతీల్లో 1.17 లక్షలు, తలమడుగు మండలంలో 28 పంచాయతీల్లో 4.22 లక్షలు, తాంసి మండలంలో 13 పంచాయతీల్లో 1.87 లక్షలు, ఉట్నూర్‌ మండలంలో 37 పంచాయతీల్లో 6.23 లక్షల మొక్కలను పెంచాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీల సంఖ్య ఆధారంగా ప్రతి పంచాయతీకీ 40 వేల మొక్కల తగ్గకుండా నర్సీరీలను ఏర్పాటు చేయనున్నారు.


logo