సోమవారం 30 మార్చి 2020
Adilabad - Feb 13, 2020 , 23:54:43

19 మందికి అస్వస్థత

19 మందికి అస్వస్థత

ఎదులాపురం: ఆడవి ఆముదం గింజలు, ఐరన్‌ మాత్రలు తిని 19 మంది విద్యార్థులు అస్వస్ధతకు గురయ్యారు. గురువారం  భీంపూర్‌ మండలంలోని తాంసి(కే) ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భోజనం అనంతరం ఐరన్‌ మాత్రలు వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు అడవి ఆముదం గింజలు సైతం తినడంతో వాంతులు ప్రారంభమయ్యాయి. దీన్ని గమనించిన పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం ఆనంద్‌ వెంటనే విద్యార్థులను రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో విద్యార్థులకు ప్రత్యేక వార్డును కేటాయించి వైద్యచికిత్సలు అందించారు. రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాం నాయక్‌తోపాటు పిల్లల వైద్య నిపుణులు వైద్యచికిత్స అందించారు. సమాచారం అందుకున్న డీఈవో రవీందర్‌రెడ్డి రిమ్స్‌కు చేరుకుని ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. కొందరు విద్యార్థులు ఐరన్‌ మాత్రలు వేసుకున్నామని, మరి కొంత మంది విద్యార్థులు అడవి ఆముదం గింజలు తిన్నామని తెలిపారు. ఈ సందర్భంగా రిమ్స్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఐదుగురు పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి ల్యాబ్‌కు పంపించామన్నారు. ఈ విషయాన్ని డీఈవో రవీందర్‌రెడ్డి కలెక్టర్‌ శ్రీ దేవసేనకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ కల్యాణ్‌రెడ్డి, వైద్యులు గజానాథ్‌, శారత్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు లక్ష్మన్న, సర్పంచ్‌  కరీం, ఎంఈవో కౌలస్య, సీఆర్‌డీ రవీందర్‌ తదితరులు ఉన్నారు.

విద్యార్థులను పరామర్శించిన బోథ్‌ ఎమ్మెల్యే

రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు గురువారం సాయత్రం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను రిమ్స్‌ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో తొడసం చందు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌, భీంపూర్‌ జడ్పీటీసీ, ఎంపీపీ, మండల నాయకులు తదితరులు ఉన్నారు.


logo