శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 13, 2020 , 23:52:37

ఆపరేషన్‌ ‘డాగ్‌'

ఆపరేషన్‌ ‘డాగ్‌'

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  పట్టణంలో పెరిగిన కుక్కుల బెడదతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకూ కుక్కలు విజృంభించి పలువురిపై దాడి చేస్తున్నాయి. వాటి బెడదను తట్టుకోలేక చాలా మంది పట్టణవాసులు నిత్యం బల్దియా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం నెల్లూరు నుంచి ప్రత్యేకంగా కుక్కలు పట్టుకొనే వారిని పిలిపించారు. వారు నిత్యం పట్టణంలో తిరుగుతూ కనిపించిన ఊరకుక్కలను బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలేస్తున్నారు. వీధి కుక్కల బెడద తగ్గుతుండడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆదిలాబాద్‌ పట్టణంలో కుక్క కాటుకు అనేక మంది బలవుతున్నారు. ముఖ్యంగా మురికి వాడల్లో ఊర కుక్కల సంఖ్య ఎక్కువగా ఉన్నది. సంతానం వృద్ధి చేసుకోవడంతో వాటి నిత్యం సంఖ్య పెరుగుతూనే ఉంది. వేలాదిగా ఉన్న కుక్కలతో పట్టణవాసులు భయపడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు కుక్కలంటేనే హడలిపోతున్నారు. చాలా మంది కుక్క కాటుకు బలై దవాఖానలో చికిత్స పొందేవారి కేసులు అనేకం ఉన్నాయి. కుక్కల బెడద నుంచి కాపాడండి అంటూ పలువురు బల్దియా అధికారులకు మొర పెట్టుకున్నారు. కౌన్సిలర్లు సైతం కుక్కలు పట్టుకుని బంధించాలని ఫిర్యాదు చేశారు. దీంతో బల్దియా అధికారులు కుక్కలను పట్టి బంధించేందుకు నెల్లూరు నుంచి మనుషులను రప్పించారు. ఒక వాహనాన్ని, ప్రత్యేకంగా ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. ఒక్క కుక్కను పట్టుకుని బంధిస్తే రూ.300 చొప్పున వారికి చెల్లించనున్నారు. కుక్కలు పట్టేవారు ఉదయం నుంచే పట్టణంలోని వీధుల్లో తిరుగుతున్నారు. ఎక్కడ కనిపించినా వెంటనే బంధించి బోనులో వేస్తున్నారు. పెంపుడు కుక్కలో.. ఊర కుక్కలో నిర్ధారించుకొని జాగ్రత్తగా బంధిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 40-50 కుక్కలను బంధించి అడవిలో వదిలి పెడుతున్నారు. కుక్కలను పట్టుకుంటుండడంతో పట్టణవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

పట్టణంలో కుక్కల సంతతి రోజురోజుకూ పెరుగుతున్నది. ఏ కాలనీలో చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు దర్శనమిస్తున్నాయి. పలు కాలనీల్లో చిన్నారులు, పెద్దవారిపై కూడా కుక్కులు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. ముగజీవులపై కూడా దాడులు చేస్తున్నాయి. వాటిలో కొన్ని పిచ్చికుక్కలు కూడా ఉన్నాయని పట్టణవాసులు ఉంటున్నారు. రాత్రి వెళలో బయటకు వెళ్లాలంటేనే పట్టణ ప్రజలు భయపడుతున్నారు. పట్టణంలో కుక్కకాటు బాధితుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. పట్టణవాసుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన బల్దియా అధికారులు పెంపుడు కుక్కలను మినహాయించి ఊరకుక్కలను పట్టుకొని బంధించాలని నిర్ణయించి చర్యలు చేపట్టారు. కుక్కలు తిరిగి పట్టణానికి రాకుండా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెడుతున్నారు.


logo