శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 12, 2020 , 23:17:05

‘కరోనా’ ఎఫెక్ట్‌

‘కరోనా’ ఎఫెక్ట్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : చైనా దేశంలో సోకిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చైనా నుంచి వచ్చిన వారిలో కేరళ రాష్ర్టానికి చెందిన ఒకరిద్దరికి కరోన వైరస్‌ సోకినట్లు వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ వైరస్‌ మటన్‌, చికెన్‌ తినడంతో వస్తుందంటూ వదంతులు వస్తున్నాయి.  దీంతో జిల్లా ప్రజలు మాంసాహారం తినాలంటేనే భయపడుతున్నారు. రోజూ లక్షల్లో జరిగే వ్యాపారం వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో మటన్‌, చికెన్‌ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. నాన్‌వెజ్‌తో కరోనా వైరస్‌ రాదని ఓ పక్క వైద్యులు సూచించినా మాంసం ప్రియులు మాత్రం తినడానికి వెనుకడుగు వేస్తున్నారు.

తగ్గుతున్న గిరాకీ..

పెండ్లీలు, పుట్టిన రోజు వేడుకలు, ఏ ఇతర శుభకార్యాలు అయినా నాన్‌వెజ్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పెళ్లిల సీజన్‌ కావడంతో డిమాండ్‌ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా మటన్‌, చికెన్‌ షాపులు ఉండగా రోజు వారీగా గొర్రెలు, మేకల క్రమ విక్రయాలు, మాంసం అమ్మకాలతో లక్షల్లో వ్యాపారం జరుగుతున్నది. ఈక్రమంలో నాన్‌వెజ్‌పై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. చైనా దేశంలో అక్కడి ప్రజలు నాన్‌వెజ్‌ తినడంతో కరోనా వైరస్‌ వచ్చిందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల చైనా నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్‌ సోకినట్లు వార్తలు రావడం పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఎప్పడూ రద్దీగా ఉండే మటన్‌, చికెన్‌ షాపులు మాంసంప్రియులు నాన్‌వెజ్‌ తినడానికి వెనుకడుగు వేయడంతో వెలవెలబోతున్నాయి. గిరాకీ తగ్గడంతో మటన్‌ కిలోకు రూ.520 ధర ఉండగా రూ.480కి, చికెన్‌ కిలోకు రూ.160 ఉండగా రూ.120కి తగ్గింది. వ్యాపారులు పోటీ పడి ధరలను తగ్గిస్తూ విక్రయిస్తున్నారు. 

అందరి చూపు కూరగాయలవైపు..

వారం వారీగా లేదా వారంలో రెండు మూడు రోజులు మాంసాహారం తీసుకొనే వినియోగదారులు కరోనా భయానికి శాకాహారం వైపు మళ్లారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో చికెన్‌, మటన్‌ వ్యాపారులకు గడ్డు కాలం దాపురించినట్లయ్యింది. ఇదే సమయంలో మరోవైపు ఆకుకూరలు, కూరగాయాలకు డిమాండ్‌ ఏర్పడుతున్నది. మాంసం లేనిదే ముద్దదిగని కొందరు ప్రత్యామ్నాయంగా కోడి గుడ్లను స్వీకరిస్తున్నారు. మరోవైపు చేపలకు కూడా గిరాకీ పెరిగింది. నాన్‌వెజ్‌ గిరాకీ తగ్గడంతో ఈ ప్రభావం పౌల్ట్రీ రైతులపై కూడా పడుతుందని వ్యాపారులు అంటున్నారు. ఆదిలాబాద్‌తో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన గ్రామాల్లో నిర్వహించే సంతలో కూడా మేకలు, గొర్రెల విక్రయాలు తగ్గాయని సమాచారం. 


logo