సోమవారం 30 మార్చి 2020
Adilabad - Feb 11, 2020 , 23:37:59

ఆర్టీసీకి ఆదాయం

ఆర్టీసీకి ఆదాయం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : మేడారం జాతర సందర్భంగా ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌కు అదనంగా ఆదాయం సమకూరింది. రీజియన్‌ పరిధిలోని ఐదు డిపోల నుంచి అధికారులు జాతరకు ప్రత్యేక బస్సులు నడిపారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌ డిపోల నుంచి 304 బస్సులు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులను చేరవేశాయి. జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు పోవడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈనెల 2 తారీఖు నుంచి 8 వరకు బస్సులు ప్రయాణికులను చేరవేశాయి. రీజియన్‌ పరిధిలోని బస్సులు 6,35,277 కిలోమీటర్ల మేర 74,615 మంది ప్రయాణికులను చేరవేయగా సంస్థకు రూ.2,65,96,343 ఆదాయం సమకూరింది. రెండేండ్ల కిందట జాతరతో పోల్చితే ఈసారి అదనంగా 27.56 శాతం ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

మేడారం జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు వెళ్ల డానికి ఆర్టీసీ అధికారులు పటిష్టమైన ప్రణాళికలు తయారు చేసి బస్సులు నడిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్‌, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌ నుంచి ఎక్కువ మంది భక్తులు జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వెళ్లే భక్తులు రవాణా పరమైన ఇబ్బందులు పడకుండా ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ ముందస్తు ప్రణాళిక ప్రకారం బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. రీజియన్‌ పరిధిలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌ డిపోల నుంచి 304 బస్సులు జాతరకు వెళ్లే భక్తుల కోసం నడిపారు. ఆదిలాబాద్‌ డిపో నుంచి 55 బస్సులు, ఆసిఫాబాద్‌ డిపో నుంచి 65, భైంసా డిపోనకు చెందిన 35, మంచిర్యాల డిపో నుంచి 97, నిర్మల్‌ డిపోనకు చెందిన 52 బస్సులను జాతరకు హాజరయ్యే భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆయా డిపోలకు చెందిన అధికారులు తమ డిపో బస్సులను ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్‌ డిపో బస్సులను చెన్నూర్‌ నుంచి మేడారం పోయో వారి కోసం, ఆసిఫాబాద్‌ డిపో బస్సులు బెల్లంపల్లి నుంచి, భైంసా డిపో బస్సులు శ్రీరాంపూర్‌ నుంచి, మంచిర్యాల డిపో బస్సులు మంచిర్యాల నుంచి, నిర్మల్‌ డిపో బస్సుల్లో మందమర్రి నుంచి మేడారం పోయో భక్తులు రాకపోకలు సాగించారు. అధికారులు ఈనెల 2 నుంచి 8వ తారీఖు వరకు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉంటూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను మేడారానికి నడిపారు.

రూ.2,65,96,343 ఆదాయం.. 

మేడారం జాతర సందర్భంగా ప్రయాణికులను చేరవేసిందనకు ఆర్టీసీకి అదనంగా ఆదాయం సమకూరింది. రీజియన్‌ పరిధిలో ఐదు డిపోల్లో 304 బస్సులను అధికారులు జాతరకు నడపగా ఏడు రోజుల్లో రూ.2,65,96,343 ఆదాయం వచ్చింది. జాతర సందర్భంగా 74,615 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయగా 6,35,277 కిలోమీటర్ల మేర బస్సులు నడిచాయి. జాతరకు పోయో వారితో పాటు మేడారం నుంచి తమ సొంత గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం అధికారులు బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రయాణాలను సాగించారు. రెండేండ్ల కిందట 2018న జరిగిన జాతరకు బస్సులు నడిపినందుకు ఆర్టీసీకి 2,08,50,335 ఆదాయం రాగా ఈసారి జాతర సందర్భంగా రూ.2,65,96,343 ఆదాయం సమకూరింది. క్రితం సారి జాతరతో పోలిస్తే ఈ సారి రూ.57,46,008 ఆదాయం అదనంగా అంటే 27.56 శాతం ఎక్కువగా వచ్చింది. జాతర సందర్భంగా ఒక్కో బస్సుకు రూ.18,483 ఆదాయం వచ్చిందని, రెండేండ్ల కిందట ఈ ఆదాయం రూ.15,279 ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


logo