ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 11, 2020 , 00:04:47

పాలన మరింత చేరువలో..

పాలన మరింత చేరువలో..

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన చేరువైంది. గతంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించే వారు. ప్రస్తుతం గంట వ్యవధిలోనే జిల్లా కేంద్రానికి చేరుకొని అధికారులకు తమ సమస్యలు తెలియజేస్తున్నారు. జిల్ల్లా పరిధి 60 కిలోమీటర్లు ఉండడంతో అధికారులు సైతం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు కొత్తగా ఇద్దరు ఉన్నతాధికారులను నియమించింది. ప్రస్తుత జాయింట్‌ కలెక్టర్‌ జి. సంధ్యారాణిని అదనపు కలెక్టర్‌గా, మహబుబాబాద్‌ జిల్లా జేసీ ఎం. డేవిడ్‌ అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు.

జిల్లాల పునర్విభజన ప్రజలకు వరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధి 230 కిలోమీటర్ల వరకు ఉండేది. దీంతో ప్రజలు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు జిల్లా కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడేవారు. వివిధ శాఖల అధికారులు సైతం దూర ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజల సమస్యలను సరిగా తెలుసుకునే వారు కాదు. గతంలో జిల్లా కేంద్రానికి వచ్చి అధికారులకు తమ సమస్యలు తెలియజేసేందుకు  ప్రజలు 200 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇందుకోసం సమయం వృథా అవడంతో పాటు, డబ్బులు ఖర్చు, రవాణా పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. జిల్లాల పునర్విభజనలో  భాగంగా పాత ఆదిలాబాద్‌ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడింది. ప్రతి జిల్లా పరిధి 60 కిలోమీటర్లకు మించి లేకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి అధికారులను నేరుగా కలిసి సమస్యలు తెలియజేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సైతం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల అమలును తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకొని మండల, గ్రామ స్థాయి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తూ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు.

ఇద్దరు అధికారుల నియామకం

జిల్లాకు కొత్తగా ఇద్దరు అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జాయింట్‌ కలెక్టర్‌ జి. సంధ్యారాణిని అదనపు కలెక్టర్‌గా నియమించారు. జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి 22 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.డేవిడ్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థల)గా నియమితులయ్యారు. ఐఏఎస్‌ అధికారుల హోదాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారుల నియామకంతో ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు కావడంతో పాటు సర్కారు పాలన ప్రజలకు మరింత చేరువ కానుంది. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. జిల్లాలో  భూ సమస్యలను పరిష్కరించిన అధికారులు 1,23,467 మంది  రైతులకు పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కాగా ప్రభుత్వం త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనుంది. రెండు విడతల పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత నెలకొనడంతో పాటు పచ్చదనం నెలకొంది. డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ షెడ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లు సైతం అందుబాటులోకి రానున్నాయి.  కొత్తగా నియమించిన అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) నియమించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా పర్యవేక్షించవచ్చు. జిల్లాలో కలెక్టర్‌తో పాటు ఇద్దరు అదనపు కలెక్టర్లు ప్రభుత్వ పథకాల అమలును, అధికారులు, సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించవచ్చు.  ప్రజలకు సైతం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తొందరగా పరిష్కరించే అవకాశాలున్నాయి.


logo