ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 11, 2020 , 00:03:06

11 సహకార సంఘాలు ఏకగ్రీవం

11 సహకార  సంఘాలు ఏకగ్రీవం

తాంసి : ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా, సోమవారం ఉపసంహరణల గడువు ముగియడంతో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడించారు.  జిల్లాలోని  28 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా 11 ఏకగ్రీవం అయ్యాయి. మ రో 17 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రంతో నామినేషన్ల ఉసంహరణకు గడువు ముగియడంతో 11 పీఏసీఎస్‌లు ఏకగ్రీవమైనట్లుగా సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 15న మిగిలిన సం ఘాల్లోని డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించనున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా సహకార శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

11సంఘాలు ఏకగ్రీవం...

ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 28 ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌) ఉండగా అందు లో 11 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు సోమవారం వెల్లడించారు. ఏకగ్రీవం అయిన పీఏసీఎస్‌లలో తాంసి, లాండసాంగ్వీ, జామిడి-ఎ, హస్నాపూర్‌, గుడిహత్నూర్‌, జామి డి (బి), ముక్రా(బి), మాన్కాపూర్‌, నర్సాపూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి ఉన్నాయి. మిగతా సంఘాలకు ఈనెల 15వ తేదిన ఎన్నికలు నిర్వహించనున్నారు. 

అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు...

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు సోమవారం సాయంత్రం గుర్తులను కేటాయించారు. తెలుగు అక్షరమాల ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. బీరువా, బ్యాటు, బ్యాటరీలైటు, బ్రష్‌, బకెట్‌, కొబ్బరికాయ, మంచం, కప్పుసాసర్‌, డిజిల్‌పంపు, గౌనుతో పాటు మొత్తం ఇరవై గుర్తులు కేటాయించారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఈ గుర్తులను కేటాయించనున్నారు.

15న ఎన్నికలు...

జిల్లాలో ఏకగ్రీవం కాగా మిగిలిన డైరెక్టర్‌ పదవులకు ఈనెల 15వ తేదిన ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా సహకారశాఖ అధికారులు నిమ గ్నమయ్యారు.  ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రభు త్వ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రదేశాలను సంబంధిత ఎన్నికల అధికారులు, సీఈవోలు పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను డీసీవో మోహన్‌ పర్యవేక్షిస్తున్నారు.

డీసీసీబీ పీఠంపై టీఆర్‌ఎస్‌...

జిల్లాలోని 28 సహకార సంఘాల్లో 11 సంఘాలు ఏకగ్రీవం కావడం టీఆర్‌ఎస్‌కు జిల్లాలో ఉన్న పట్టును తెలియజేస్తోంది. ఏకగ్రీవమైన సంఘాలన్నీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవే. ఇప్పటికే  ఏకగ్రీవమైన సొసైటీ డైరెక్టర్‌లను క్యాంపు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో పట్టునిలుపుకోవడం కోసం టీఆర్‌ఎస్‌ నాయకత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఎన్నికలు జరిగే స్థానాలు కూడా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో నేటి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం సొసైటీలను గెలుపొంది ఎలాగైనా డీసీసీబీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎత్తులు వేస్తున్నది. జిల్లాలో 11 సహకార సంఘాలన్నీ ఏకగ్రీవం చేసుకోవడంలో సక్సెస్‌ అయిన టీఆర్‌ఎస్‌ మిగతా సొసైటీల్లో కూడా జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా డీసీసీబీ చైర్మన్‌ పదవి ఆశిస్తున్న ఒక టీఆర్‌ఎస్‌ జిల్లాస్థాయి నేత తన పరిధిలోని డైరెక్టర్‌లందరినీ ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు తన పీఏసీఎస్‌ డైరెక్టర్‌లందరినీ క్యాంపునకు తరలించారు. డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్న మరో నేత  కూడా తన పరిధిలోని 9 మంది డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకోవడంలో సఫలం అయ్యారు. ఇలా ఇద్దరు బలమైన నేతలు తమకు అనుకూలంగా ఉన్న డైరెక్టర్లను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జిల్లాలో డీసీసీబీ చైర్మన్‌ పీఠంపై  టీఆర్‌ఎస్‌ జెండా ఎగురేయడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు.


logo