బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 00:01:14

స్వయంగా వచ్చి..సమస్యలు విని..

 స్వయంగా వచ్చి..సమస్యలు విని..

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొలిసారి హాజరైన కలెక్టర్‌ శ్రీ దేవసేన తనదైన శైలిలో అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే వృద్ధులు ఇబ్బందులు పడకుండా వారిని లోపలికి పంపాలని, వారి కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేయాలని అధికారులను ఆదేశించారు. తనను సన్మానం చేసేందుకు వచ్చిన వారికి తిరిగి సన్మానం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల క్యాలెండర్‌ను వారితో పాటు నేలపై కూర్చొని ఆవిష్కరించారు. 

   పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన శ్రీదేవసేన పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నాలుగు రోజుల కిందట జిల్లా అధికారులతో ఆరు గంటల పాటు సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ అధికారులు, సిబ్బంది అవినీతి రహిత పాలనను కొనసాగించి ప్రజలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాలను వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలన్నారు. తప్పుడు నివేదికలతో పాటు అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంలో భాగంగా సోమవారంలోగా ప్లాస్టిక్‌ సంచుల్లో మట్టి నింపడాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో డ్వామా, మండల  పరిషత్‌, ఇతర శాఖల అధికారులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 

ప్రజావాణిలో తనదైన శైలిలో

సోమవారం కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో  కలెక్టర్‌ తనదైన శైలిలో వ్యవహరించారు. కలెక్టర్‌ చాంబర్‌ నుంచి సమావేశ మందిరం వరకు నడుచుకుంటూ వచ్చారు. తమ సమస్యలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఓపిగ్గా మాట్లాడుతూ వారి నుంచి దరఖాస్తుల తీసుకున్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, అర్జీదారులు రెండోసారి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగులతో కలిసి నేలపై కూర్చోని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తనను సన్మానించేందుకు వచ్చిన వారికి తిరిగి సన్మానించారు. logo